paytm: ప్ర‌తిష్ఠాత్మ‌క‌ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఇక ‘పేటీఎం’ విజయగాథ.. కేస్ స్టడీగా స్వీకరణ!

ప్ర‌తిష్ఠాత్మ‌క‌ హార్వ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో ఇక పేటీఎంకు సంబంధించిన‌ పాఠాలు చెప్పనున్నారు. భార‌త్‌లో పేటీఎం అంచెలంచెలుగా ఎదిగి విజ‌యం సాధించి, ఇప్పుడు ఎంతో మందికి ఉపాధి క‌ల్పిస్తోన్న విష‌యం తెలిసిందే. డిజిట‌ల్ వాలెట్‌గా మొదలైన పేటీఎం పేమెంట్ బ్యాంక్‌గా ఎదిగిన తీరును ఓ కేస్ స్ట‌డీగా ఆ వ‌ర్సిటీ బిజినెస్ స్కూల్‌లోని ఇండియా రీసెర్చ్ సెంటర్‌ ప్ర‌చురించింది. ఈ స‌క్సెస్ స్టోరీకి ‘పేటీఎం: బిల్డింగ్ ఎ పేమెంట్స్ నెట్‌వ‌ర్క్’ పేరు పెట్టారు. ఈ పాఠాన్ని ఇక‌పై హార్వ‌ర్డ్ వ‌ర్సిటీ లోప‌ల‌, బ‌య‌ట కూడా టీచింగ్‌కు ఉప‌యోగించ‌నున్నారు. ఆ వ‌ర్సిటీలో ఇండియా రీసెర్చ్ సెంటర్ 2006లో ప్రారంభ‌మైంది.

ద‌క్షిణాసియా ప్రాంతంలో వ‌స్తున్న మార్పులు, ట్రెండ్స్‌ల‌పై ఈ సెంట‌ర్‌ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశోధన జ‌రిపి హార్వ‌ర్డ్ ఫ్యాకల్టీకి కేస్ స్ట‌డీస్‌ను అందిస్తుంది. వినియోగ‌దారుల చెల్లింపు విధానాల్లో పేటీఎం ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తుంద‌ని, భార‌త్‌లో డిజిట‌లైజేష‌న్‌కు ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని ఈ కేస్ స్ట‌డీలో పాల్గొన్న ప్రొఫెస‌ర్లు చెబుతున్నారు. ఈ విష‌యంపై పేటీఎం సీఈవో విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ మాట్లాడుతూ... త‌మ స‌క్సెస్ స్టోరీని ఆ వ‌ర్సిటీలో పాఠాలుగా బోధించ‌డం త‌మ‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. భార‌త్‌ జ‌నాభాలో 50 కోట్ల మందిని ప్ర‌ధాన ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో భాగం చేసే గొప్ప కార్య‌క్ర‌మాన్ని తాము చేప‌ట్టామ‌ని ఆయ‌న తెలిపారు.

More Telugu News