: ఆశారాం బాపుకు సుప్రీంకోర్టులో ఏడోసారి చుక్కెదురు.. లక్ష జరిమానా

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇది ఏడోసారి. ఈ సందర్భంగా ఆశారాంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బెయిల్ కోసం తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించారంటూ వ్యాఖ్యానించింది. వివరాల్లోకి వెళ్తే తనకు ఆరోగ్యం బాగాలేదని, బెయిల్ ఇవ్వాలని ఆశారాం సుప్రీంకోర్టును కోరారు. దీనికి సంబంధించి కొన్ని వైద్య పరీక్షల రిపోర్టులను కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలో, మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయనకు సుప్రీంకోర్టు సూచించింది. అయితే, మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి ఆశారాం నిరాకరించారు. దీంతో, ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ ను నిరాకరించింది. అంతేకాదు, ఆయనకు రూ. లక్ష జరిమానా విధించింది. ఆశారాంపై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలతో 2013 నుంచి ఆశారాం బాపు జైల్లో ఉన్నారు. 

More Telugu News