: కలసికట్టుగా ఐఎస్ఐఎస్ పీచమణుద్దాం... పుతిన్ కు తొలిసారి ఫోన్ చేసి గంటపాటు మాట్లాడిన ట్రంప్

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడారు. దాదాపు గంటపాటు జరిగిన సంభాషణలో, సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను పూర్తిగా తుదముట్టించేందుకు సంయుక్త దళాలను పంపే దిశగా చర్చలు సాగినట్టు వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. రష్యా, అమెరికాల మధ్య ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని తేలిక పరిచేలా ఇరు దేశాల అధినేతలూ మాట్లాడుకున్నారని ఓ అధికారి వెల్లడించారు.

కాగా, ఐఎస్ఐఎస్ ను ఎలా ఓడించాలన్న విషయమై వ్యూహాన్ని రచించాలని పెంటగాన్ ను ట్రంప్ ఆదేశించారు. ఇదే సమయంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ను పునర్వ్యవస్థీకరించాలని కూడా ఆయన సూచించారు. 30 రోజుల్లోగా రక్షణ శాఖ తన ప్రణాళికను అందించాలని ట్రంప్ ఆదేశించినట్టు సమాచారం. గత పాలకులు అవలంబించిన విధానాలతో పోలిస్తే, ఉగ్రవాదంపై తాను కఠినంగా ఉంటానన్న విషయాన్ని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News