zukerburg: డొనాల్డ్ ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన సంతకంపై ఫేస్ బుక్ సీఈవో ఆగ్రహం

ఎన్నిక‌ల సంద‌ర్భంగా తాను ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చే క్ర‌మంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులతో పాటు ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న‌ ఈ ఆర్డర్‌పై సంతకం చేయడంపై ఇప్ప‌టికే మ‌లాలాతో పాటు హక్కుల సంఘాలు, సామాజిక కార్యకర్తలు మండిప‌డ్డారు. తాజాగా ఫేస్ బుక్ సీఈవో మార్క్  జుకర్ బర్గ్ కూడా ట్రంప్ నిర్ణ‌యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఈ ఆదేశాల ప్రభావం గురించి తాను చింతిస్తున్నానని త‌న ఫేస్‌బుక్‌ పేజీలో జుకర్ బర్గ్ పోస్ట్ చేశారు. ఉగ్ర‌వాదుల నుంచి దేశాన్ని రక్షించుకోవ‌డం ప్ర‌ధాన‌మే అయినా ఆపదలో ఉన్నవారికీ, శరణార్థులకు సాయం చేసేందుకు మాత్రం ముందుండాల‌ని కోరారు. వారికి సాయపడేందుకు అమెరికా దేశ ద్వారాలు ఎల్ల‌ప్పుడూ తెరిచే ఉండాలని పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికా ఇలా వ్యవహరించి ఉంటే త‌న భార్య‌ చాన్ ప్రిస్కిల్లా ఈ రోజు అక్క‌డ ఉండేది కాదని అన్నారు. తన భార్య కుటుంబం  చైనా వియత్నాం నుంచి వలస వచ్చిన విషయాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. త‌మ‌ది వలస దారుల దేశమ‌ని, వలసదారులకు మంచి పనిని, జీవనాన్ని అందివ్వగలిగితే అమెరికాకే మంచిదని అన్నారు.

త‌మ దేశ‌ భవిష్యత్తులో వల‌స‌దారులు కూడా ఒక భాగమని జుకర్ బర్గ్ పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో అందరికీ మరింత ఉన్నతమైన స్థానంగా త‌మ దేశాన్ని తీర్చిదిద్దడానికి అందరం ధైర్యంగా, సంయమనంగా పనిచేయడానికి ఆయ‌న ఆకాంక్షించారు.

More Telugu News