trump: చ‌ర్య‌లు ప్రారంభం.. ముస్లింల‌ను అమెరికాలోకి రానివ్వ‌కుండా డొనాల్డ్‌ ట్రంప్ సంత‌కం

ఎన్నిక‌ల సంద‌ర్భంగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఇచ్చిన హామీల అమ‌లుకు అడుగులు వేస్తున్నారు. ముస్లిం దేశాల నుంచి వచ్చే శరణార్థులు, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు త‌మ దేశంలోకి ప్ర‌వేశించ‌కుండా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేశారు. ముస్లిం మెజార్టీ దేశాల నుంచి అమెరికాకు వలసలు తగ్గించేందుకు ఆయ‌న చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఆయా దేశాల‌ నుంచి వచ్చే వారిని చాలా జాగ్రత్తగా పరీక్షించే విధంగా నిబంధనలు రూపొందించే ఆదేశాలపై సంతకం చేశారు. ఈ సంద‌ర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇస్లామిక్‌ ఉగ్రవాదులను త‌మ దేశం బయటే ఉంచేందుకు క్లిష్టమైన నిబంధనలు తీసుకువస్తున్నాన‌ని అన్నారు. త‌మ దేశంలో ఉగ్రవాదులు ఉండాలని తాము అనుకోవట్లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అయితే, ఆయ‌న‌ ఈ ఆర్డర్‌పై సంతకం చేయడాన్ని హక్కుల సంఘాలతో పాటు సామాజిక కార్యకర్తలు ఖండిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని అంటున్నారు. ట్రంప్ చేసిన ఈ సంత‌కంతో వలసదారులకు సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించే వరకు ఇరాక్‌, సిరియా, ఇరాన్‌, సూడాన్‌, లిబియా, సోమాలియా, యెమెన్‌ దేశాలకు చెందిన పౌరులకు మూడు నెల‌ల పాటు అమెరికా వీసాల జారీని ఆపేస్తారు. దానితోపాటు ఆ దేశంలో ఉన్న‌ శరణార్థుల పునరావాస కార్యక్రమం కూడా కనీసం 120 రోజుల పాటు నిలిపివేస్తారు. సిరియా వలసదారుల్లో క్రిస్టియన్లకు ప్రాముఖ్య‌త‌నివ్వ‌నున్నారు. త‌మ దేశానికి మద్దతిచ్చే వారు, త‌మ దేశ పౌరుల‌పై అభిమానం ఉన్న వారే అమెరికాకు రావాలని తాము కోరుకుంటున్న‌ట్లు ట్రంప్ తెలిపారు.

More Telugu News