: నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టలేదు...కానీ ఆంధ్రుడ్నే: సమ్మిట్ లో ఆకట్టుకున్న సురేష్ ప్రభు

నేను ఆంధ్రప్రదేశ్ లో పుట్టనప్పటికీ ఆంధ్రుడ్నేనని కేంద్ర మంత్రి సురేష్ ప్రభు అన్నారు. తాను ఈ గొప్ప రాష్ట్రం నుంచే పార్లమెంటుకు వెళ్లానని అన్నారు. విశాఖపట్టణంలో ఏర్పాటు చేసిన భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడుతూ, జీఎస్టీ బిల్లు అమలులోకి వచ్చిన తరువాత దేశ వ్యాప్తంగా సరళీకృత పన్ను విధానం అమలులోకి వస్తుందని అన్నారు. తద్వారా దేశ ప్రజలకు, పారిశ్రామిక వేత్తలకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని ఆయన చెప్పారు.

రైల్వేలలో సంస్కరణలు అమలు చేస్తున్నామని, తద్వారా భారీ పెట్టుబడులకు మార్గం సుగమమం చేస్తున్నామని తెలిపారు. తద్వారా రాష్ట్రాలు ఆర్ధికాభివృద్ధి సాధిస్తాయని, రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ సంస్కరణలకు తలుపులు తీశానని, అయితే ఎవరూ ముందుకు రాలేదని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు మాత్రమే స్పందించారని, దీంతో ఇప్పుడు ఏపీ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉందని ఆయన చెప్పారు.

ప్రపంచం వేగంగా అభివృద్ధి  చెందుతోందని, అలా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి ఆసియా ఆశాకిరణంగా కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఆసియాకు భారత్ ఆశాకిరణంగా ఉందని, భారత్ కు ఆంధ్రప్రదేశ్ ఆశాకిరణంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఏపీ సన్ రైజింగ్ స్టేట్ అని, భారత దేశం సన్ షైనింగ్ దేశమని, ఈ రెండూ కలిస్తే అద్భుతాలు సాధ్యమవుతాయని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబునాయుడు లాంటి అద్భుతమైన వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధించడం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.  

భారత్ లో పెట్టుబడి పెట్టడం వ్యాపారాభివృద్ధికి బాటలు వేయడమైతే, అందులోనూ ఏపీలో పెట్టుబడి పెట్టడం ప్రపంచంలోని గొప్ప వాణిజ్య కేంద్రంలో పెట్టుబడి పెట్టడమేనని ఆయన అన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన తరుణమని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఇలాంటి అవకాశం అందరికీ దక్కే ఛాన్స్ ఉండకపోవచ్చని, ఇప్పుడే పెట్టుబడులు పెట్టి, ఇతర పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. తాను చాలా కాలంగా చూస్తున్నానని, ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్తలు అద్భుతమైన విజయాలు నమోదు చేస్తున్నారని ఆయన అన్నారు. వారికి మాత్రమే ఎందుకు సాధ్యమైందంటే ఏపీ చరిత్రలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాంటి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అద్భుతమైన భవిష్యత్ కు బంగారు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

More Telugu News