ram gopal varma: పవన్ కల్యాణ్ చేసుకున్న మూడు పెళ్లిళ్ల గురించి నేను మాట్లాడలేదు కదా?: పవన్ పై రాంగోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు

ఈ రోజు మీడియా స‌మావేశంలో మాట్లాడిన జనసేన అధినేత, సినీన‌టుడు పవన్ కల్యాణ్... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై తీవ్రస్థాయిలో మండిపడ్డ విష‌యం తెలిసిందే. ఓ పెళ్లైన కూతురు కూడా ఉన్న వ‌ర్మ‌..  పోర్న్‌ సినిమాలు చూస్తానని చెప్పుకుంటారని, ఆయన గురించి తానేం మాట్లాడనని ప‌వ‌న్ అన్నారు. అయితే ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై వర్మ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.  
 
ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్ కల్యాణ్‌పై వ‌ర్మ తెలుగులో స్పందిస్తూ... తాను ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగా ఆయ‌న‌పై ప‌లు ఎక్స్ పెక్టేషన్స్ తో మాట్లాడాను గానీ ఆయన చేసుకున్న మూడు పెళ్లిళ్ల లాంటి పర్సనల్ విషయాలపై తానెప్పుడూ మాట్లాడ‌లేద‌ని పేర్కొన్నారు. త‌న లైఫ్ స్టైల్ తాను ఆలోచించే విధానాన్ని దాచుకోకుండా, దాక్కోకుండా తాను రాసిన‌ పుస్తకం 'నా ఇష్టం'లో మెత్తం విప్పి రాశాన‌ని ఆయ‌న అన్నారు.

వాళ్లింట్లో వాళ్ల గురించి మాట్లాడారని కొన్ని రోజుల క్రిత‌మే యండమూరి వీరేంద్రనాథ్‌ని తిట్టారని, మరి వాళ్లు వేరే వాళ్ల గురించి మాట్లాడొచ్చా? అని వ‌ర్మ ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ఇదేనా వికాసం అంటే? అని ప్ర‌శ్నించారు. తాను వ‌ప‌న్ మీద ఇష్టంతో నిజాయతీగా మాట్లాడానని, ఆయ‌న‌ను విమ‌ర్శ‌లు చేయ‌డానికి కాద‌ని ప‌వ‌న్‌ తెలుసుకోలేకపోవటం త‌న‌‌ దురదృష్టమ‌ని ఆయ‌న అన్నారు. పవన్ క‌ల్యాణ్‌కి, అతని భార్యకు, పిల్లలకు, కుటుంబానికి, జనసేన పార్టీకి, పవన్ అభిమానుల‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. చివ‌రికి గుడ్ బై అని అన్నారు.



More Telugu News