: అప్పుడు రైలు త‌గ‌ల‌బెట్టారు.. ఇప్పుడు విశాఖ‌ను త‌గ‌ల‌బెట్టాల‌ని చూస్తున్నారు.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగిన చంద్ర‌బాబు

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నిప్పులు చెరిగారు. హుద్‌హుద్ తుపానుతో అత‌లాకుత‌లమైన న‌గరాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దితే దానిని త‌గ‌ల‌బెట్టాల‌ని చూస్తున్నార‌ని తీవ్ర‌స్థాయిలో మండిపడ్డారు. గురువారం రాత్రి విశాఖ‌ప‌ట్ట‌ణంలో నిర్వ‌హించిన విలేకరుల స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశ‌ప్ర‌జ‌లంద‌రూ ఆనందంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటుంటే రాజ‌కీయ పార్టీలు ఆందోళ‌న‌ల‌కు పిలుపునివ్వ‌డం దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేద‌న్నారు. విశాఖ విమానాశ్ర‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుతో ప్ర‌యాణికులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డ్డార‌న్నారు.  భాగ‌స్వామ్య స‌ద‌స్సులో పాల్గొనేందుకు వ‌చ్చిన డీఐపీపీ కార్య‌ద‌ర్శి కూడా జ‌గ‌న్ నిర్వాకంతో బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. కేంద్రం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీకి త్వ‌ర‌లో చ‌ట్ట‌బ‌ద్ధ‌త వ‌స్తుంద‌న్నారు. విద్యార్థుల   జీవితాల‌ను నాశ‌నం చేసేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. ప్ర‌త్యేక హోదాతో స‌మానంగా అన్ని ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తామంటేనే ప్యాకేజీకి అంగీక‌రించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు.

అవినీతి ఆరోప‌ణ‌ల‌తో జైలుకు వెళ్లి వ‌చ్చిన వ్య‌క్తి త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. విశాఖప‌ట్ట‌ణంలో నౌకా ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించిన స‌మ‌యంలో తునిలో రైలును త‌గ‌లబెట్టార‌ని, ఇప్పుడు భాగ‌స్వామ్య స‌ద‌స్సు నిర్వ‌హిస్తుంటే దానిని విచ్ఛిన్నం చేసేందుకు విశాఖ‌ను త‌గ‌ల‌బెట్టాల‌ని జ‌గ‌న్ కంక‌ణం క‌ట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నేనేదో దాబా పెట్టుకున్న‌ట్టు, అంద‌రినీ పిలిచి భోజ‌నం చేసి వెళ్లండ‌ని ప్రాధేయ‌ప‌డేందుకు దావోస్ వెళ్లిన‌ట్టు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు. అయినా మ‌న రాష్ట్రం ప‌రిస్థితి ఇప్పుడు అదేన‌న్నారు. గ‌తంలో కాంగ్రెస్‌లో అంతోఇంతో విజ్ఞ‌త ఉన్న నాయ‌కులు ఉండేవార‌ని ప్ర‌సుతం జ‌గ‌న్‌లో ఆ ల‌క్ష‌ణాలు లేవ‌ని దుయ్య‌బ‌ట్టారు. అధికారం కోసం రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించాల‌ని చూస్తున్నారంటూ తీవ్ర‌స్థాయిలో ఆరోపించారు.

More Telugu News