: తొలి టీ20 ఇంగ్లండ్ దే...ఆకట్టుకున్న మోర్గాన్, రూట్

తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు భారత్ పై అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించింది. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేసిన భారత జట్టు ధోనీ (36), సురేష్ రైనా (34), కోహ్లీ (29) రాణించినా నిలదొక్కుకోకపోవడంతో కేవలం 147 పరుగులు మాత్రమే చేసింది. 148 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టుకు రాయ్ (11), బిల్లింగ్స్ (22) శుభారంభం అందించారు. వీరిద్దరూ కేవలం పది బంతులు చొప్పున ఆడినా భారీ షాట్లతో విరుచుకుపడ్డారు.

వీరిద్దర్నీ చాహల్ తొందరగా పెవిలియన్ కు పంపినా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (51) భారత బౌలర్లపై విరుచుకుపడి అర్ధ సెంచరీ సాధించాడు. అతనికి జోరూట్ (46) అద్భుతమైన సహకారమందించాడు. దీంతో మోర్గాన్ అవుటైనా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా బెన్ స్టోక్స్ (2) సహకారంతో కాగల కార్యం పూర్తి చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో 148 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఇంగ్లండ్ స్పిన్నర్ మోయిన్ అలీ నిలిచాడు. దీంతో 2017లో ఆడిన తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు ఓటమిపాలైంది. 

More Telugu News