: డియర్ డొనాల్డ్ ట్రంప్! దయచేసి వాళ్లని రక్షిస్తారా!: సిరియా చిన్నారి విన్నపం

సిరియా అనగానే గుర్తొచ్చేది.. అక్కడి అలెప్పో నగరం. ప్రభుత్వ దళాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన యుద్ధంతో అతలాకుతలమైన అలెప్పో నుంచి ప్రజలు ఆ దేశ సరిహద్దులు దాటుతుంటారు. ఈ క్రమంలో అలెప్పో నుంచి టర్కీకి వెళ్లిపోయింది ఫాతిమా కుటుంబం. ఆమెకు బనా అల్బెడ్ అనే ఏడేళ్ల కూతురు ఉంది. అలెప్పోలో బనా అల్బెడ్ నాడు గడిపిన జీవితానికి, ప్రస్తుతం టర్కీలో తన తోటి పిల్లలతో ఆడుకుంటూ, సరదాగా గడుపుతున్న జీవితానికి ఏమాత్రం పొంతనలేదు.

అయితే, అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ ను పలుసార్లు న్యూస్ ఛానెళ్లలో చూసిన ఆ చిన్నారి ట్రంప్ కు ఒక లేఖ రాసింది. ఆ లేఖను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ విషయంలో బనా అల్బెడ్ తల్లి ఫాతిమా సహకరించిందట. యూఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే తన కూతురు ఈ లేఖ రాసిందని, టీవీలో పలుసార్లు ఆయన్ని చూసిందని ఫాతిమా పేర్కొంది. అయితే, ట్రంప్ కు  ఆ చిన్నారి రాసిన లేఖ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడమే కాదు, హృదయాలను కదిలించి వేస్తోంది. ఈ లేఖ సాగిన తీరు..

డియర్ డోనాల్డ్ ట్రంప్.. ‘నా పేరు బనా అల్బడ్. నా వయసు ఏడేళ్లు. నేను సిరియాలోని అలెప్పో నగరానికి చెందిన చిన్నారిని. గత ఏడాది డిసెంబర్ లో తూర్పు అలెప్పో లో జరిగిన యుద్ధం కారణంగా నా కుటుంబం టర్కీకి వచ్చేసింది. అయితే, బాంబుల దాడితో సిరియాలో ఉన్న నా స్కూల్ ధ్వంసమైంది. నా స్నేహితులకు దూరమైనందుకు చాలా బాధగా ఉంది. నా స్నేహితులతో కలిసి ఆడుకునేవాళ్లం. ఇకపై, నేను వాళ్లతో ఆడుకోలేను.. ఎందుకంటే, అలెప్పో ఈజ్ ద డెత్ సిటీ. ప్రస్తుతం టర్కీలో నేను బయటకు వెళుతున్నాను..ఆడుకుంటున్నాను. నాకు లభించిన ఈ అవకాశం..లక్షలాది సిరియన్ చిన్నారులకు లేదే! సిరియాలోని పలుచోట్ల చిన్నారులు బాధపడుతున్నారు. మీరు, అమెరికా అధ్యక్షుడు అవుతారని నాకు తెలుసు. సిరియా ప్రజలను, అక్కడి చిన్నారులను దయచేసి మీరు రక్షిస్తారా? సిరియా చిన్నారుల కోసం ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే, వాళ్లు కూడా మీ పిల్లల లాంటి వాళ్లే. మీకు కావాల్సిన శాంతి వాళ్లకూ కావాలి. సిరియా చిన్నారులకు ఏదో ఒకటి చేస్తానని మాటివ్వండి. మీరు వాళ్ల కోసం ఏం చేస్తారో చూస్తా!’ అని ఆ లేఖలో బనా అల్బడ్ పేర్కొంది.

More Telugu News