: చంద్రబాబే ఇలా చేస్తుంటే గుండె తరుక్కుపోతోంది: జగన్

ప్రత్యేక హోదాపై రాష్ట్ర యువత ఆకాంక్షను దేశం మొత్తానికీ తెలిసేలా చెప్పడానికి మరోసారి సన్నద్ధమవుతున్న సమయంలో, ప్రజాగ్రహాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరమని వైకాపా అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన శాంతియుత నిరసనలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్, హోదా సాధన కోసం జరిగే ఎలాంటి పోరుకైనా మద్దతిస్తామని స్పష్టం చేశారు.

గతంలో తమ పార్టీ ఎన్నో పోరాటాలు చేసిందని, నిరాహారదీక్షలు, ధర్నాలు చేసిందని జగన్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదా సాధన దిశగా, అండగా నిలవాల్సిన సీఎం ఆ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం ముందు మోకరిల్లారని విమర్శించారు. పార్లమెంట్ ఇచ్చిన హామీనే నిలుపుకోలేని పరిస్థితిలో ప్రజాస్వామ్యం ఉండటం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడుస్తుండటాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నదని అన్నారు. ఇప్పటికైనా ఆయన తన పద్ధతి మార్చుకోవాలని సలహా ఇచ్చారు. జగన్ వెంట పార్టీ నేతలు ఉమారెడ్డి, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తదితరులు ఉన్నారు.

More Telugu News