: వార్తా ఛానెళ్లు, పేపర్లతో ఇక ప‌ని కాదు... సోషల్‌ మీడియానే ఉప‌యోగిద్దాం: ప‌్రొ.కోదండ‌రాం కీల‌క వ్యాఖ్య‌లు

వార్తా ఛానెళ్లు, పేప‌ర్లు వార్త‌ల‌ను ప్రజలకు అర్థం అయ్యే రీతిలో ప్రసారం చేయ‌డం లేద‌ని టీజేఏసీ ఛైర్మ‌న్ కోదండ‌రాం అన్నారు. అంతేగాక  మీడియా సంస్థలన్నీ కొందరి చేతుల్లోనే ఉన్నాయ‌ని, దీంతో తాము చేస్తోన్న కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరడంలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఇక సామాజిక మాధ్య‌మాల్లో నైపుణ్యాలను పెంపొందించుకుని వాటి ద్వారా స‌మాచారాన్ని అందించాల‌ని ఆయ‌న త‌మ కార్య‌కర్త‌ల‌కు సూచించారు. టీజేఏసీ ఆధ్వర్యంలో హైద‌రాబాద్‌లోని కాచిగూడలో నిర్వ‌హించిన ‘సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌’ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... టీజేఏసీ ఆశ‌యాల‌ను ప్రజలకు చేర వేసే విధంగా చూసుకోవాలని చెప్పారు. ప్ర‌స్తుత‌ సమాజంలో 35 నుంచి 40 శాతం వరకు ప్ర‌జ‌లు సామాజిక మాధ్య‌మాల‌ని వినియోగిస్తున్నార‌ని అన్నారు.

వార్తా సంస్థలకంటే వాటి ద్వారానే సమాచారం వేగంగా అందుతున్నదని తెలిపారు. తాము ప్రజా సమస్యలే ఎజెండాగా పోరాడుతున్నామ‌ని ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూ ట్యూబ్‌, వాట్సప్ లాంటి వాటిని ఇక విరివిగా వినియోగిస్తామ‌ని చెప్పారు. తెలంగాణ‌లో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు స‌ర్కారుపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి తాము వ‌చ్చేనెల‌ మూడవ వారంలో తెలంగాణ నిరుద్యోగ భారీ ర్యాలీని చేప‌డ‌తామ‌ని అన్నారు.

More Telugu News