: 11 సీట్లపై మెలిక... కాంగ్రెస్, ఎస్పీల మధ్య తేలని పంచాయతీ

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయినప్పటికీ, సీట్ల పంచాయతీ ఇంకా తేలలేదు. మొత్తం 403 అసెంబ్లీ సీట్లున్న యూపీలో పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు 99 సీట్లను సమాజ్ వాదీ నేత అఖిలేష్ యాదవ్ ఆఫర్ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ 110 సీట్లు కావాలని అడుగుతోంది. కనీసం 104 సీట్లయినా ఇవ్వాలని ఆ పార్టీ అడుగుతోంది. రెండు పార్టీల మధ్య చర్చలు తుది దశకు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీకి బలమున్న ప్రాంతాల్లో సీట్లను ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకరించారని, మరో 10 సీట్లపై చర్చలు సాగుతున్నాయని కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్ వ్యాఖ్యానించారు.

 కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేలున్న 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాజ్ వాదీ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుపడుతోంది. తమ సిట్టింగ్ స్థానాలన్నీ తమకే వదిలివేయాలని సూచిస్తోంది. రాయ్ బరేలీ, అమేథి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీలనూ కాంగ్రెస్ కోరుతోంది. కాగా, ఇరు పార్టీల మధ్యా చర్చల విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించేందుకు స్వయంగా సోనియాగాంధీ రంగంలోకి దిగుతారని సమాచారం. ఆమె అఖిలేష్ తో నేడు మాట్లాడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

More Telugu News