: కళ్లు తిరుగుతున్నాయని ఆసుపత్రికి వెళ్తే... చేయి, కాలు తీసేస్తామంటున్నారని వాపోతున్న తల్లిదండ్రులు!

కళ్లు తిరుగుతున్నాయని, నీరసంగా ఉందని చెప్పి ఆసుపత్రికి వెళ్లిన యువతికి ప్రాణాల మీదికి తెచ్చిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. బాధితురాలు వైష్ణవి తండ్రి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 3న తమ కుమార్తె వైష్ణవి నీరసంగా ఉందని చెప్పడంతో నాచారంలోని ప్రసాద్ హాస్పిటల్‌ కు తెసుకెళ్లారు. దీంతో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. దీంతో డోనర్లను తీసుకురావడంతో ఆ ఉదయం ఒక ప్యాకెట్ రక్తం ఆమెకు ఎక్కించారు. అనంతరం రాత్రికి మరో ప్యాకెట్ రక్తం ఎక్కించడంతో వైష్ణవి ఆరోగ్యం మరింత క్షీణించింది. నీరసం కాస్తా వాంతులు, కడుపు నొప్పిగా మారింది. దీంతో ఆమె మరింత ఇబ్బంది పడింది. తెల్లారేసరికి ఆమె కుడిచేతికి వాపు వచ్చిందని కుటుంబ సభ్యులు సిబ్బందికి చెప్పడంతో ఆమెను ఆసుపత్రి సిబ్బంది ఆగమేఘాల మీద అంబులెన్స్ లో అపోలో ఆసుపత్రికి పంపించారు.

వాస్తవానికి అపోలో ఆసుపత్రికి పంపుతున్నట్టు తమకు ముందుగా చెప్పలేదని తెలిపారు. ఆ రోజంతా అబ్జర్వేషన్ లో ఉంచిన అనంతరం కుడిచేతికి ఇన్ఫెక్షన్ వచ్చిందని, ఆపరేషన్ చేయాలని అన్నారని, ఆలస్యంగా నిర్ణయం చెబితే ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారన్నారు. దీంతో చేసేదేమీ లేక వారు అందుకు అంగీకరించారు. దీనికి 4 లక్షల రూపాయలు చెల్లించామని, తిరిగి మూడు రోజుల క్రితం కాలుకి ఇన్ఫెక్షన్ సోకిందని, దానిని తీసేయాలని, లేని పక్షంలో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకుతుందని చెబుతున్నారని, ఇందుకు 20 లక్షల రూపాయలు అవుతుందంటున్నారని, అంత మొత్తం తమ వద్ద లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 100 మంది నుంచి బ్లడ్ తీసుకున్నారని, ఇంత చేసినా తమ కుమార్తెను ప్రాణాలతో అప్పగిస్తారో లేదోనన్న ఆందోళన నెలకొందని వారు తెలిపారు. 

More Telugu News