: తొలి సభ కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లోనే పెడతా!: రేవంత్ రెడ్డి

రైతు ఆత్మహత్యల నివారణకు తెలంగాణ ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాల్లో ఎలాంటి భరోసా ఇవ్వలేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు. పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ఫీజు బకాయిలు కూడా చెల్లించలేదని, సింగరేణి బొందలగడ్డగా మారుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యంపై నిరసనగా మంత్రుల నియోజకవర్గాల్లో టీడీపీ సభలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.

అందులో భాగంగా తొలి సభ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ లో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అలాగే గ్రామీణ, మండల స్ధాయుల్లో కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన చెప్పారు. టీడీపీ మాత్రమే ప్రజా సమస్యలపై పోరాడుతోందని ఆయన తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు. శాసనసభను ముఖ్యమంత్రి ప్రచారానికి ఉపయోగించుకున్నారని విమర్శించారు. తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. 

More Telugu News