: జల్లికట్టు ఆర్డినెన్స్ కు తమిళనాడు గవర్నర్ ఆమోదం.. రేపు జల్లికట్టును ప్రారంభించనున్న పన్నీర్ సెల్వం!

జల్లికట్టుకు అనుమతిస్తూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ను ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్. విద్యాసాగరరావు ఆమోదించారు. మొదట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ ను కేంద్రానికి పంపగా, దానిని కేంద్రం న్యాయశాఖకు పంపిన సంగతి తెలిసిందే. దీనికి కొన్ని మార్పులతో కేంద్ర న్యాయశాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో దీనిని గవర్నర్ ఆమోదం కోసం మళ్లీ తిప్పిపంపారు. దీనికి గవర్నర్ తాజాగా ఆమోద ముద్ర వేశారు.

దీంతో ఆ రాష్ట్రంలో జల్లికట్టుపై నిషేధం తాత్కాలికంగా తొలగిపోనుంది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం జంతుహింస నిరోధక చట్టాన్ని సవరించి, అందులో పెర్ఫామింగ్ యానిమల్స్ జాబితా నుంచి ఎద్దును తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం పది గంటలకు తమిళనాడులోని మధురై జిల్లాలోని అలంగా నెల్లూరులో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జెండా ఊపి జల్లికట్టును ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆయన చెన్నై నుంచి మధురై బయల్దేరడం విశేషం. 

More Telugu News