: సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదరకపోతే... లాభం ఎవరికి?

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ ల మధ్య పొత్తు కుదరడం అనుమానంగానే  కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండానే ఎస్పీ 210 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. రేపు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసే పనిలో ఉంది. పొత్తులో భాగంగా ఇన్నాళ్లు 103 సీట్లను అడిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ సంఖ్యను 138కి పెంచేసింది. కాంగ్రెస్ కు అసలు 100 సీట్లు ఇవ్వడమే దండగ అనుకుంటే, ఏకంగా 138 సీట్లు ఎలా ఇస్తారని సమాజ్ వాదీ పార్టీ నేతలు అంటున్నారు.

ఒకవేళ ఈ రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల బరిలోకి దిగితే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీనే. ఉత్తర ప్రదేశ్ లో 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే... 15 స్థానాలకు మించి గెలుచుకోవడం చాలా కష్టమని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఎస్పీ, బీఎస్పీల ముస్లిం ఓట్ బ్యాంకును మాత్రం కాంగ్రెస్ చీల్చుతుందట. ఇది బీజేపీకి మేలు చేస్తుందని అంటున్నారు. కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగితే... బీజేపీ నేతలు ప్రశాంతంగా ఉండవచ్చని చెబుతున్నారు.  

More Telugu News