: జ‌ల్లిక‌ట్టు, కోడి పందేలపై ఘాటుగా స్పందించిన ప‌వ‌న్ క‌ల్యాణ్!

త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు క్రీడ‌ను నిర్వ‌హించ‌డానికి అనుమ‌తి ఇవ్వాలంటూ ఆ రాష్ట్ర ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగిన వేళ ఆ అంశంతో పాటు కోడిపందేలపై కూడా జ‌న‌సేనాని, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ట్విట్ట‌ర్‌లో ఘాటుగా స్పందించి, కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌ల్లిక‌ట్టు, కోడిపందేల నిర్వ‌హ‌ణ‌కు ఆయ‌న‌ మ‌ద్ద‌తు తెలిపారు. ద‌క్షిణ భార‌త దేశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ఎలా చూస్తోందో చెప్పడానికి ఇదే నిద‌ర్శ‌నమ‌ని పేర్కొన్నారు. జ‌ల్లిక‌ట్టు నిషేధాన్ని ద్ర‌విడ సంస్కృతిపై జ‌రుగుతున్న దాడిగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

అదే స‌మ‌యంలో మ‌న సంస్కృతి, ఆవులు, మాతృభూమిపై త‌న‌కు ఎన‌లేని గౌర‌వం ఉంద‌ని అన్నారు. త‌న‌ గోశాలలో 16 ఆవులు ఉన్నాయని, త‌న‌ పొలంలో జీవామృతాన్ని వినియోగించి సాగుచేస్తున్నాన‌ని అన్నారు. త‌మిళ‌నాడులో తన సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో తాను ఓ విషయాన్ని గమనించానని, దక్షిణ భార‌త దేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఎలా చూస్తోందో తాను అర్థం చేసుకున్నాన‌ని చెప్పారు. జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును నిషేధించారని పేర్కొన్న పవన్ కల్యాణ్... నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్, బీఫ్ ఎగుమతుల మీద కూడా చర్యలు తీసుకోవాలని మరో ట్వీట్ లో పేర్కొన్నారు.




More Telugu News