: యువీ, ధోనీ రికార్డు ఇన్నింగ్స్... టీమిండియా 381 పరుగుల భారీ స్కోరు

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మాజీ వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్ రికార్డు ఇన్నింగ్స్ తో భారత జట్టు 381 పరుగుల భారీ స్కోరు సాధించింది. కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడిన భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. ఇంగ్లండ్ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్ క్రిస్ వోక్స్ వరుసగా మెయిడెన్ ఓవర్లలో వేస్తూ మూడు వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ ఆరంభంలోనే టీమిండియా 25 పరుగులకే ధావన్ (11), రాహుల్ (5), కోహ్లీ (8) ల వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.

దీంతో ఇంగ్లండ్ శిబిరంలో మ్యాచ్ పై ఆశలు మొలకెత్తాయి. వారి ఆశలు ఆవిరిచేసేందుకు యువరాజ్ సింగ్ ఎక్కువ సమయం తీసుకోలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఎలాంటి భావోద్వేగాలు చూపని యువీ, భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 150 పరుగులు చేసి, అవుటైన యువీ పెవిలియన్ కు చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన కేదార్ జాదవ్ కేవలం 9 బంతులెదుర్కొని 22 పరుగులు పిండుకున్నాడు. మరోపక్క ధోనీ జట్టు స్కోరు పెంచే క్రమంలో 134 పరుగుల వద్ద అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్డిక్ పాండ్య (19), రవీంద్ర జడేజా (16) భారీ షాట్లతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ నాలుగు వికెట్లతో రాణించగా, ప్లంకెట్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ విజయ లక్ష్యం 382 పరుగులు.

More Telugu News