: ఇక్కడ మనోళ్లు తెల్లారగానే బ్యాగులేసుకుని పాకీ పనులకు వెళ్లిపోతారు...!: 'డాలర్ డ్రీమ్స్' వద్దంటున్న యువతి

డాలర్ డ్రీమ్స్ పేరుతో అమెరికా రావద్దని తెలుగమ్మాయి సోషల్ మీడియాలో చేసిన విజ్ఞప్తి వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే... భారత యువతకు అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలనేది ఒక కల.. ఒక్క ఏడాది అమెరికాలో ఉద్యోగం చేసేస్తే తరువాత జీవితాంతం దర్జాగా కాలుమీద కాలేసుకుని బతికేయొచ్చు అన్నది బలంగా ఉన్న అభిప్రాయం. దీంతో ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసిన ప్రతి ఒక్కరి లక్ష్యం అమెరికానే. ప్రధానంగా ఆ కోరిక తెలుగు రాష్ట్రాల ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. ఆడపిల్లల తల్లిదండ్రులైతే అమెరికా సంబంధం వస్తే చాలు, తలతాకట్టుపెట్టయినా సరే పెళ్లి చేస్తారు.

ఈ నేపథ్యంలో, ఈ డాలర్ డ్రీమ్స్ గురించి ఓ తెలుగు యువతి మనవారికి ఏం చెబుతోందంటే... ప్రతి ఒక్కళ్లూ ఎన్నో ఆశలు, పెద్ద ఉద్యోగాల కోరికతో అమెరికా వస్తారని చెప్పింది. తాను కూడా అలాగే అమెరికా వచ్చానని తెలిపింది.

 కానీ వాస్తవానికి అమెరికాలో జరిగేది ఏంటంటే... తెల్లవారి లేవగానే బాగా తయారై, బస్సులు, రైళ్లు, కార్లలో విధులకు ఠంచనుగా వెళ్లిపోతారని తెలిపింది. అయితే వారంతా వెళ్లేది ఏవో గొప్ప ఉద్యోగాలకు కాదని, పాకీ పనులకని అసలు సీక్రెట్ విప్పింది. పిల్లల్ని చూడడం, ముసలి వాళ్లను చూసుకోవడం, ఇళ్లలో పనులు చేయడం వంటి వాటికని చెప్పింది. తాను కూడా అలాంటి ఉద్యోగమే చేస్తున్నానని చెప్పింది. అలాంటి వాళ్లు గొప్పగొప్ప ఇళ్లలో ఉన్నట్టు ఇక్కడి వాళ్లకు ఫోటోలు పంపుతారని, అయితే ఇక్కడ రెంట్లు కూడా బాగా ఎక్కువని చెప్పింది. జీతం 2,000 డాలర్లయితే, రెంట్ 3,000 డాలర్లుంటుందని, దానిని తట్టుకునేందుకు ఒక్కోఇంట్లో 15 మంది వరకు ఉంటారని ఆమె చెప్పింది. దీంతో ఒక్కొక్కరికి 300 వరకు పడుతుందని వెల్లడించింది.

అంతే కాకుండా అప్పుడప్పుడు ఇళ్లలో ఇన్స్ స్పెక్షన్ ఉంటుందని, ఆ రోజు ఇంట్లో కాంట్రాక్టుపై ఎవరు సంతకం చేశారో వాళ్లు మాత్రమే ఉండాలని చెప్పింది. దీంతో ఈ రోజు తాను ఇంటి బయట ఉండాల్సి వచ్చిందని నవ్వుతూనే తన బాధను వెళ్లగక్కింది. సాయంత్రం వరకు అలాగే చావాలని, ఇక్కడ కనీసం ఎవరిని ఎవరూ పలకరించుకోరని, కనీసం నీళ్లిచ్చే నాధుడు కూడా ఉండడని చెప్పింది. ఎవరైనా తెలుగు వాళ్లు కనిపిస్తారా? అని చూస్తున్నానని, అందరూ తలుపులు బిడాయించుకుని కూర్చున్నారని చెప్పింది. ఇలాంటి బతుకు బతకడం కంటే స్వదేశంలో ఉండడమే మేలని తెలిపింది. డాలర్ డ్రీమ్స్ అని ఇంజనీరింగ్ చెయ్యగానే అమెరికా అంటూ పరుగులు పెట్టవద్దని సలహా ఇచ్చింది. ఈ వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే, ఆ యువతి ఎవరు? తన స్వగ్రామం ఏది? అన్నది మాత్రం చెప్పలేదు.  

More Telugu News