: అర్ధ సెంచరీతో సత్తా చాటిన యువరాజ్ సింగ్...టీమిండియా 100/3

టీమిండియా డాషింగ్ ఆటగాడు యువరాజ్ సింగ్ పునరాగమనం ఘనంగా చాటాడు. కెరీర్ లో ఉత్థానపతనాలు చూసిన యువరాజ్ సింగ్ మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. కెరీర్ పీక్ లో ఉండగా, జట్టుకు రెండు వరల్డ్ కప్ లు అందించి క్యాన్సర్ కారణంగా జట్టుకు దూరమైన యువరాజ్ తరువాత ఆ మహమ్మారి బారినుంచి కోలుకుని జట్టులో స్థానం సంపాదించాడు. అయితే నిలకడ లేమి కారణంగా జట్టు నుంచి అతనికి ఉద్వాసన పలికారు.

దీంతో పట్టువదలని విక్రమార్కుడిలా శ్రమించి, రంజీల్లో పరుగుల వరద పారించిన యువీకి ఇంగ్లండ్ జట్టు పర్యటన అనుకోని వరంలా వచ్చింది. ఇంగ్లండ్ జట్టుపై ఘనమైన రికార్డు కలిగిన యువీకి బీసీసీఐ స్థానం కల్పించింది. దీంతో తొలి వన్డేలో పెద్దగా ఆకట్టుకోని యువరాజ్ సింగ్... గతంలో తన సహజశైలిని గుర్తుకు తెచ్చేలా, వరుసగా మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులో దిగి నిలకడైన దూకుడు ప్రదర్శించాడు. మంచి బంతులను గౌరవిస్తూ, అవకాశం చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీలైన్ దాటించాడు. ఈ క్రమంలో యువీ (50) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో భారత జట్టు 22 ఓవర్లలో వంద పరుగుల మార్కు చేరింది. మరో ఎండ్ లో ధోనీ (21) నెమ్మదిగా వేగం పెంచుతున్నాడు. 

More Telugu News