: నోట్ల రద్దుపై స్టాండింగ్ కమిటీ ముందు నోరు విప్పని ఆర్థిక శాఖ అధికారులు!

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ విచారణ చేపట్టింది. కొత్త కరెన్సీ నోట్లు ఎన్ని ప్రింట్ చేశారు? నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు ఎంత మేర వెనక్కి వచ్చాయి? అంటూ ఆర్థిక శాఖ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది. స్టాండింగ్ కమిటీ ప్రశ్నలకు అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరప్ప మొయిలీ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ ముందు ఆర్థిక శాఖకు చెందిన అధికారులు ఈరోజు హాజరయ్యారు.

పాత నోట్లు ఎన్ని వచ్చాయని కమిటీ అడిగితే అధికారుల వద్ద సమాధానమే లేకపోయిందట. కొత్త నోట్లు ఎన్ని ప్రింట్ చేశారన్న ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోయారట. శుక్రవారం నాడు కేవీ థామస్ నేతృత్వంలోని మరో కమిటీ ముందు వీరు హాజరుకావాల్సి ఉంది. సరైన సమాధానాలు చెప్పకపోతే ప్రధాని మోదీకి కూడా సమన్లు జారీ చేస్తామని థామస్ ఇప్పటికే హెచ్చరించారు. నోట్ల రద్దును విచారిస్తున్న కమిటీలు ఇప్పటికే ఆర్బీఐ గవర్నర్, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేశాయి. 

More Telugu News