: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ (సీనియర్)కు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్ డబ్ల్యూ బుష్ (సీనియర్) అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. టెక్సాస్ లోని హ్యోస్టన్ లో ఈ ఉదయం ఆయనను హాస్పిటల్ లో చేర్పించారు. ఈ విషయాన్ని కేహెచ్ఓయూ అనే టీవీ సంస్థ వెల్లడించింది. అయితే, ఆయనను ఏ హాస్పిటల్ లో చేర్పించారనే విషయాన్ని మాత్రం సదరు సంస్థ వెల్లడించలేదు.

సీనియర్ బుష్ వయసు 92 సంవత్సరాలు. కొన్ని రోజుల తర్వాత బుష్ ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారని తెలిపింది. మరోవైపు, బుష్ ఆసుపత్రిలో చేరడానికి గల అనారోగ్య కారణాలను కూడా సదరు టీవీ వెల్లడించలేదు. గతంలో ఓ సారి ఆయన కింద పడ్డారు. అప్పుడు ఆయన మెడలోని ఎముక విరిగిపోయింది. అప్పుడు ఆయన కుమారుడు, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ (జూనియర్) ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సీనియర్ బుష్ కుర్చీకే పరిమితం అయ్యారు. మెడ ఎముక విరిగిన నేపథ్యంలో, ఇప్పటికీ ఆయన మెడకు పట్టీని ధరిస్తున్నారు. 

More Telugu News