: పని చేయని అధికారులను ఇంటికి పంపేస్తున్న మోదీ సర్కారు!

చేస్తున్నది సాధారణ క్లర్క్ ఉద్యోగమైనా, కలెక్టరు గిరీ అయినా, ఏదో నాలుగ్గంటలు ఆఫీసులో టైం పాస్ చేసి ఇంటికెళ్లిపోవచ్చు, పెద్దగా కష్టపడకుండానే రిటైరైన తరువాత కూడా పింఛన్ తీసుకోవచ్చని భావించే రోజులు పోయాయి. హోదా ఉంది కదాని పని చేయని అధికారులను ఇంటికి పంపేస్తోంది నరేంద్ర మోదీ సర్కారు. రెండున్నరేళ్ల క్రితం మోదీ అధికారాన్ని చేపట్టిన తరువాత, సరిగ్గా పని చేయని 60 మంది అధికారులను విధుల నుంచి తొలగించడమో లేదా తప్పనిసరిగా రిటైర్ మెంట్ ఇవ్వడం వంటి చర్యలు జరిగాయి. వీరిలో ఐపీఎస్ అధికారులు కూడా ఉండటం గమనార్హం.

1992 బ్యాచ్‌ కి చెందిన ఐపీఎస్ అధికారి రాజ్‌ కుమార్ దేవన్‌ గణ్, 1998 బ్యాచ్‌ కి చెందిన అధికారి షీల్ చౌహాన్ ల పనితీరును సమీక్షించిన తరువాత ఇద్దరినీ ముందుగానే రిటైర్ చేయించి ఇంటికి పంపారు. సర్వీసులో చేరి 25 ఏళ్ల వరకు గడిచిన ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్న ప్రభుత్వం ఈ తరహా చర్యలకు ఉపక్రమిస్తోంది.

వీరిద్దరికీ, మూడు నెలల జీతం ఇచ్చి తప్పనిసరి ముందస్తు రిటైర్‌ మెంట్ ఇచ్చినట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సమర్థత లేనివారు, అవినీతిపరులు ప్రజా ప్రయోజనాల రీత్యా తప్పనిసరిగా రిటైర్ కావాలన్న రాజ్యాంగ నిబంధన అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మోదీ ప్రభుత్వం ఈ విధంగా 60 మందిని తొలగించడంతో, మిగతా అధికారుల్లో ఇప్పుడు గుబులు చెలరేగుతోంది.

More Telugu News