: బీజేపీలో చేరిన నాలుగు రోజుల‌కే తిరిగి కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం కుమార్తె.. జంపింగుల‌కు కొత్త భాష్యం!

సాధార‌ణంగా ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత నేత‌లు పార్టీలు మార‌డం స‌హ‌జం. ఇటీవ‌ల ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జంపింగుల ప‌ర్వం ఊపందుకుంది. ప్రజా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌పెట్టేసి కండువాలు మార్చ‌డంలో బిజీగా మారిపోయారు. అయితే తాజాగా పంజాబ్ మాజీ ముఖ్య‌మంత్రి బియాంత్‌సింగ్ కుమార్తె గురుక‌న్వాల్ జంపింగుల‌కే కొత్త భాష్యం చెప్పారు. నాలుగు రోజుల క్రితం బీజేపీలో చేరిన ఆమె మంగ‌ళ‌వారం తిరిగి సొంత‌గూడు అయిన కాంగ్రెస్ పార్టీలో చేరి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తారు. బీజేపీలో త‌న‌కు స‌రైన గుర్తింపు ల‌భించ‌క‌పోవ‌డంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్నానంటూ ప్ర‌క‌టించారు. నాలుగు రోజుల‌కే గుర్తింపు ద‌క్క‌లేద‌న్న ఆమె వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్ర విమ‌ర్శ‌ల జ‌డివాన కురుస్తోంది.

ప్ర‌ధాని నరేంద్ర‌మోదీ సార‌థ్యంలో ప‌నిచేయ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని పేర్కొంటూ ఆర్థిక‌మంత్రి అరుణ్‌జైట్లీ స‌మ‌క్షంలో గురుక‌న్వాల్ బీజేపీలో చేరారు. బీజేపీ త‌న‌కు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆరోపిస్తూ మంగ‌ళ‌వారం ప‌టియాలాలో పీసీసీ అధ్య‌క్షుడు అమ‌రీంద‌ర్‌సింగ్ స‌మ‌క్షంలో తిరిగి గురుక‌న్వాల్ సొంత పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

More Telugu News