: ప్రభుత్వం నుంచి నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది: రోహిత్ వేముల తల్లి ఆరోపణ

ప్రభుత్వం నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని ఆత్మహత్య చేసుకున్న హెచ్సీయూ విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక ఆరోపించారు. యూనివర్శిటికీ రోహిత్ లేఖ రాసిన రోజే, అధికారులు స్పందించి ఉంటే తనకు పుత్రశోకం ఉండేది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కులం నిర్ధారణ పేరిట తనను తీవ్ర వేదనకు గురిచేశారని ఆరోపించిన ఆమె, యూనివర్శిటీలో ఏ ఒక్క విద్యార్థి ఇలా మరణించొద్దని అన్నారు.

కాగా, రోహిత్ వేముల వర్థంతి సందర్భంగా నివాళులర్పించేందుకు విద్యార్థులు హెచ్సీయూకు భారీగా తరలివచ్చారు. రోహిత్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. హెచ్ సీయూ వసతి గృహం నుంచి ప్రధాన ద్వారం వరకు విద్యార్థులు భారీ ర్యాలీగా చేరుకున్నారు. హెచ్సీయూ బయటకు వెళ్లి ఆందోళన చేసేందుకు విద్యార్థులు యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన్ ఆప్ కార్యకర్తలు, పలు విద్యార్థి సంఘాల కార్యకర్తలను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. వీసీని కలిసేందుకు యత్నించిన
రోహిత్ వేముల తల్లి రాధిక సహా పలువురు విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాధిక తో పాటు పలువురు విద్యార్థులను అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.


More Telugu News