: హ్యాంగోవర్ కారణంగా ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టిన టెన్నిస్ ఆటగాడు!

సాధారణంగా క్రీడాకారుల షెడ్యూల్ చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. ప్రతి రోజూ రెండు పూటలా ప్రాక్టీస్ తప్పని సరిగా చేయాలి. ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అయితే వర్థమాన టెన్నిస్ ఆటగాడు పూటుగా తాగి ప్రాక్టీస్ ఎగ్గొట్టడం క్రీడావర్గాల్లో కలకలం రేపింది. 2015 వింబుల్డన్ జూనియర్ డబుల్స్ టైటిల్ గెలిచిన ద్వయంలో సుమిత్ నాగల్ సభ్యుడు. గతేడాది జరిగిన డేవిస్ కప్ లో రిజర్వ్ ఆటగాడు కావడం విశేషం. ఈ సందర్భంగా జరిగిన ఉదయం పూట ప్రాక్టీస్ సెషన్ కు సుమిత్ హాజరు కాలేదని చెప్పి, టీమ్ నుంచి తొలగిస్తూ ఇప్పుడు చర్యలు తీసుకున్నారు. దానికి కారణమేంటా? అని టెన్నిస్ సంఘం ఆరాతీయగా, మినీ బార్ ను ఖాళీ చేసేయడం వల్ల సుమిత్ హ్యాంగోవర్ కారణంగా ప్రాక్టీస్ కు హాజరుకాలేదని తేలిందని, అందుకే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

సెప్టెంబర్ లో స్పెయిన్ తో జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ లో ఆడిన సుమిత్ తన గర్ల్ ఫ్రెండ్ ను కూడా తీసుకొచ్చాడని, అయితే కెప్టెన్ ఆనంద్ అమృత్‌ రాజ్ హెచ్చరికలతో ఆమెను వెనక్కి పంపేశాడని తేలింది. అదే డేవిస్ కప్ లో చివరి మ్యాచ్ ఆడాలని కోరితే, అందుకు నిరాకరించడం కూడా అతనిపై చర్యలు తీసుకునేందుకు కారణమైందని అధికారులు వెల్లడించారు. పదేపదే క్రమశిక్షణోల్లంఘన కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడని వారు పేర్కొన్నారు. అయితే కేవలం 19 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుని, మద్యం కారణంగా జట్టునుంచి నిష్క్రమించిన ఆటగాడిగా సుమిత్ నాగల్ అపకీర్తి మూటగట్టుకున్నాడు. 

More Telugu News