: రాత్రికి రాత్రే విశ్వనగరాలు నిర్మాణం కావు!: శాసనసభలో కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని రోడ్ల దుస్థితిని ప్రస్తావిస్తూ బీజేపీ నేత కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో అభివృద్ధి అంశంపై తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు చేసిన విమర్శలకు కేటిఆర్ స్పందిస్తూ, విషాద నగరమని బీజేపీ నేత కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు. రాత్రికి రాత్రే విశ్వనగరాలు నిర్మాణం కావని, హైదరాబాద్ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. తెలంగాణలో మూడో వంతు జనాభా హైదరాబాద్ మహానగరంలో ఉందని, అందుకే అభివృద్ధి విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు.

ఏమీ లేని చోట సింగపూర్ లా చేస్తానని కొంతమంది చెబుతున్నారని విమర్శించారు. వాళ్ల నాయకుడు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లినా, కొన్ని అవశేషాలు మాత్రం ఇక్కడే ఉన్నాయని పరోక్షంగా టీడీపీని విమర్శించారు. అంబర్ పేట నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదనేది వాస్తవం కాదని అన్నారు. గతంలో ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో అపార్ట్ మెంట్లలో జనరేటర్లు ఉన్నది నిజం కాదా? అని, ఇందిరా పార్క్ వద్ద కరెంట్ కోతలు ఉన్నాయని ధర్నాలు చేసింది మరిచారా? అని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ పరిధిలో నీటి సమస్యలు తీరాయని కేటీఆర్ అన్నారు.

More Telugu News