: తమిళనాడు రాజకీయాల్లో మొదలైన కొత్త శకం... అమ్మ వారసత్వ పోరు ప్రారంభం!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం నెల రోజుల తరువాత, రాష్ట్రంలో ఆమె వారసత్వ పోరు అధికారికంగా నేడు ప్రారంభమైంది. ఈ ఉదయం ఎమ్జీఆర్ సమాధి వేదికగా, తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన జయలలిత మేనకోడలు దీప, శశికళకు సవాల్ విసిరారు. దీప సోదరుడు జయకుమార్ కుమార్తెగా దీపలో ఓ రకంగా జయలలిత రక్తమే ప్రవహిస్తుండటం ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది.

ఇక దీప తన రాజకీయ ఎంట్రీకి ఎంజీఆర్ శతజయంతిని ఎంచుకోవడం వెనుక తన వ్యూహ చతురతకు ఆమె పదును పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మెరీనా బీచ్ కి తన అనుచరులతో శశికళ వస్తున్న సమయానికే దీప చేరుకోవడం, ఆపై నినాదాలు, ప్రతి నినాదాలన్నీ రాజకీయ వ్యూహంగానే తెలుస్తోంది. పోటీలోకి తాను దిగానని శశికళ వర్గానికి చెప్పడమే దీప ప్రధాన ఉద్దేశంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

లండన్ లో విద్యను అభ్యసించిన దీప, ఇంతకాలం వెలుగులోకి రాలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె చిన్న వయసులో ఉండగా, పెంచి పోషించిన జయలలితే, ఆ తరువాత దూరం పెట్టారు. ఇక జయలలిత 75 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా దీపను అనుమతించలేదు. డిసెంబర్ లో జయలలిత మరణించినప్పుడు కూడా దీపను దగ్గరికి రానీయలేదు. ఇవన్నీ ప్రజల్లో దీప పట్ల సానుభూతిని పెంచాయని, శశికళను వ్యతిరేకిస్తున్న వర్గానికి దీప ఓ ఆశాదీపంలా కనిపించిందని తమిళనాడులోని తలపండిన రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక హావభావాల్లో మేనత్తను పోలివుండటం దీపకు మరో ప్లస్ పాయింట్ గా మారింది. ఇప్పటికే పలు పోస్టర్లలో అచ్చం జయలలిత మాదిరిగానే కనిపిస్తున్న దీప చిత్రాలు గ్రామీణ ప్రాంత ప్రజల్లో దీపే వారసురాలన్న భావనను కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అమ్మ వారసత్వ పోరులో దీప ఏ మేరకు విజయం సాధిస్తుందన్నది వేచి చూడాలి.

More Telugu News