: అఖిలేష్ తో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధం.. మహాకూటమి దిశగా అఖిలేష్ అడుగులు!

సమాజ్ వాదీ పార్టీ అఖేలేష్ దే అని ఎన్నికల సంఘం తేల్చి చెప్పేయడంతో యూపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల పర్వం ఒక్కసారిగా ఊపందుకుంది. అఖిలేష్ తో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ లోని అన్ని  స్థానాలకు పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని... అయితే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నామని కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జాల్  ఈరోజు ప్రకటించారు. సమాజ్ వాదీ పార్టీ మొత్తం అఖిలేష్ సింగ్ యాదవ్ వెంటే ఉంటుందని అఫ్జాల్ తెలిపారు. త్వరలోనే అఖిలేష్, రాహుల్ లు ఎన్నికల కార్యాచరణకు సంబంధించి చర్చలు జరుపుతారని అన్నారు.

మరోవైపు, మహాకూటమి దిశగా అఖిలేష్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీతో పాటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ లతో కలసి కూటమి ఏర్పాటు చేసేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారు. ఈ పొత్తులకు అవకాశం ఉందని అఖిలేష్ బాబాయ్ రాంగోపాల్ యాదవ్ కూడా స్పష్టం చేశారు. ఫిబ్రవరి 11 నుంచి యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఈ ఎన్నికలు జరుగుతాయి.

More Telugu News