: 'సైకిల్' పోయిందన్న బాధలో ములాయం... ఆశీర్వాదం ఇవ్వండంటూ తండ్రి వద్దకు వెళ్లిన అఖిలేష్!

పాతికేళ్లుగా సమాజ్ వాదీ పార్టీని విజయవంతంగా నడిపిస్తూ, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన ములాయం సింగ్ యాదవ్ కు... ఆ పార్టీతో అనుబంధం తెగిపోయినట్టే కనిపిస్తోంది. కన్న కొడుకే తనపై తిరుగుబాటు జెండాను ఎగురవేసి, పార్టీని తన గుప్పిట్లో ఉంచుకోవడం ఈ రాజకీయ కురువృద్ధుడిని కలచివేసింది. ఒకానొక సమయంలో పార్టీ నుంచి కూడా అఖిలేష్ ను సస్పెండ్ చేశారు ములాయం. ఆ తర్వాత అతనిపై సస్పెన్షన్ ఎత్తివేశారు.

ఇన్ని జరిగినా అఖిలేష్ ఏ మాత్రం తగ్గలేదు. మెజారిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తన వెంటే ఉన్నారు కనుక... పార్టీ తనదే అంటూ ప్రకటించారు. మరోపక్క, పార్టీ తనదే, పార్టీ గుర్తు సైకిల్ తనదే అంటూ ములాయం ప్రకటించారు. దీంతో, పార్టీ గుర్తు కోసం ఇంటి పోరు కాస్తా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. ఈ క్రమంలో, గుర్తు ఎవరిదో మీలో మీరే తేల్చుకోండంటూ ఈసీ ఒక అవకాశం ఇచ్చింది. అయినప్పటికీ, సైకిల్ తనదంటే తనదే అని ఇద్దరూ పట్టుబట్టారు. ఈ ఉత్కంఠభరిత వాతావరణంలో, చివరకు సైకిల్ గుర్తు అఖిలేష్ వర్గానికే చెందుతుందని ఈసీ ములాయంకు షాక్ ఇచ్చింది. మెజారిటీ నేతలు అఖిలేష్ వెంటే ఉండటంతో... పార్టీ అఖిలేష్ దే  అంటూ ఈసీ తేల్చివేసింది.

ఈసీ నిర్ణయంతో ములాయం పూర్తిగా డీలా పడిపోయారు. ఈసీ నిర్ణయం వెలువడిన వెంటనే అఖిలేష్ నివాసం వద్ద, పార్టీ కార్యాలయం వద్ద ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. సమాజ్ వాదీ పార్టీ కార్యాలయంలో అఖిలేష్ ఛాంబర్ వద్ద... 'అఖిలేష్ సింగ్ యాదవ్, పార్టీ అధ్యక్షుడు' అనే నేమ్ ప్లేట్ కూడా పెట్టేశారు.

ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడిన వెంటనే అఖిలేష్ తన భార్య డింపుల్ తో కలసి తన తండ్రి నివాసానికి వెళ్లారు. ములాయం ఆశీర్వాదం తీసుకున్నారు. మనసులో ఎంతో బాధ ఉన్నా... వచ్చింది కన్న కొడుకు కదా! ములాయం కూడా అఖిలేష్ ను ఆశీర్వదించారు. అయితే, వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మాత్రం తెలియరాలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిలేష్ కు మద్దతు ప్రకటించడం మినహా... ములాయం చేసేదేమీ లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 

More Telugu News