: పందెం రాయుళ్లు సేదదీరేందుకు కార్ వాన్ లు... రోజుకు రూ. 40 వేల అద్దెతో ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలు, పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి తమ ప్రాంతానికి వచ్చి కోడి పందేలు కాసే ప్రముఖులు సేదదీరేందుకు బరి నిర్వాహకులు ఈ దఫా కార్ వాన్ లను ఏర్పాటు చేశారు. సాధారణంగా సినీ హీరోలు ఔట్ డోర్ షూటింగులకు వెళ్లినప్పుడు, ప్రధాన ప్రజా ప్రతినిధులు, వీవీఐపీలు రెస్ట్ తీసుకునేందుకు వీటిని వాడుతుంటారు. వీటికి అద్దె రోజుకు దాదాపు రూ. 40 వేల వరకూ ఉంటుంది.

ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కోడిపందాలకు పెట్టింది పేరైన భీమవరం సమీపంలోని వెంప గ్రామంలో 18 ఎకరాల భూమిని పందాల కోసం కేటాయించారు. పెద్ద ఎత్తున కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అక్కడే ఉండేందుకు సకల సౌకర్యాలు కల్పించారు. దీంతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. కోళ్లకు కత్తులను కట్టించబోమని హామీ ఇస్తూనే, కత్తులను కట్టిన కోళ్లతోనే పందాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. రికార్డింగ్ డ్యాన్సులు అందరినీ అలరిస్తున్నాయి. ఇక విజయవాడను ఆనుకొని వున్న ఈడ్పుగల్లు, పెదపులిపాక, నున్న, అంపాపురం తదితర ప్రాంతాల్లో సైతం కోడి కాళ్లకు కత్తులు కట్టారు. పెదపులిపాకలో పందెం గెలిచిన విజేతలకు ఎమ్మెల్సీ వైబీ రాజేంద్ర ప్రసాద్ బైక్ లను అందించారు. అతిథులకు సంక్రాంతి నాన్ వెజ్ అయిన గారెలు, కోడి పులుసుతో ఆతిథ్యం ఇచ్చారు.

More Telugu News