journalist: శరణార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన మహిళా వీడియో జర్నలిస్టుపై వేటు

సెర్బియా-హంగేరీ సరిహద్దులోని రోజ్కే గ్రామంలో 2015, సెప్టెంబర్ లో శరణార్థుల న్యూస్‌ని క‌వ‌ర్ చేయ‌డానికి వెళ్లిన‌ ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు త‌న అతి ప్ర‌వ‌ర్త‌న‌తో తానే హాట్ న్యూస్‌గా మారి విచార‌ణ ఎదుర్కుంటున్న సంగ‌తి తెలిసిందే. ఆ హంగేరీ మహిళా వీడియో జర్నలిస్టు పెట్రా లాజ్లోపై కోర్టు మూడేళ్ల ప్రొబెషన్ బాన్ విధించింది. ఆమె చేసిన త‌ప్పుపై సుదీర్ఘ‌ విచారణ జరిపిన జెజెడ్ పట్టణ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే శ‌రణార్ధుల ప‌ట్ల‌ అమానవీయంగా ప్రవర్తించిందని స‌ద‌రు న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.
 
ఆమె అప్ప‌ట్లో ప్ర‌వ‌ర్తించిన తీరుని చూస్తే... హంగేరీ న్యూస్ ఛానెల్‌ 'ఎన్ 1 టీవీ'లో పెట్రా లాజ్లో కెమెరా ఉమన్‌గా ప‌నిచేస్తోంది. సెర్బియా నుంచి హంగేరీ చేరిన శరణార్థుల న్యూస్‌ను క‌వ‌ర్ చేయ‌డానికి ఆమె వెళ్లింది. రోజ్కే గ్రామం వద్ద సోదాలు పూర్తి చేసుకుని శ‌రణార్థులు ఆ దేశంలో ప్రవేశిస్తారు. అయితే, శరణార్థులను తనిఖీల కోసం అను‌మతినిస్తూ గేట్లు తెరవడంతో ఒక్క‌సారిగా శ‌రణార్ధులు దూసుకొచ్చారు. ఆ సమయంలో ప్రాణ భయంతో పిల్లాడితో పరిగెడుతున్న ఓ శరణార్థి కాళ్లకు తన కాళ్లు అడ్డం పెట్టింది ఈ మ‌హిళా జ‌ర్న‌లిస్టు. దీంతో ఆ వ్యక్తి పిల్లాడితో పాటు కిందపడిపోయాడు. ఈ వీడియో అక్క‌డి ఓ కెమెరాకు చిక్క‌డంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారి, విమర్శలకు దారితీసింది. దీంతో ఎన్1 టీవీ యాజమాన్యం ఆమెను తొల‌గించింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వ‌హించ‌డానికి వెళ్లి జాత్యహంకారం ప్ర‌ద‌ర్శించ‌డంతో ఆమె కోర్టులో విచారణ ఎదుర్కొంది. అయితే, కోర్టు ఇచ్చిన ఈ తీర్పును అప్పీలు చేస్తానని ఆమె అంటోంది.

More Telugu News