: అమరావతి బాగా కలిసొచ్చింది.. తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతోంది: సీఎం చంద్రబాబు

అమరావతి బాగా కలిసి వచ్చిందని, తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆరోగ్యం, ఆదాయం, ఆనందం..అందరికీ ముఖ్యమని అన్నారు. కన్నతల్లిని, మాతృభూమిని మరువకూడదని అన్నారు. సంక్రాంతి పండగ తెలుగువారి వారసత్వం అని, ప్రకృతి ఆరాధనకు ఈ పండగ వేదిక అని అన్నారు. సంక్రాంతి స్టాళ్ల వద్దకు రాగానే తన బాల్యం గుర్తొచ్చిందని చెప్పారు. కూచిపూడి నేర్చుకున్న వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని, ప్రతి ఇంట్లో ఒకరు కూచిపూడి నృత్యం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, 200 మంది కూచిపూడి నాట్యాచార్యులకు రూ.12 వేలు గౌరవ వేతనంగా ఇస్తున్నామని అన్నారు.

అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండాలని సంక్రాంతి సంకల్పం చేసుకోవాలని, జన్మభూమి గ్రామసభల్లో చాలా వరకు ఫిర్యాదులు తగ్గాయని అన్నారు. ఫిబ్రవరి నుంచి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఫిర్యాదుల పరిష్కారం నిమిత్తం అధికారులు వారంలో రెండు రోజులు గ్రామాల్లో పర్యటిస్తారని చెప్పారు. పట్టిసీమ, ముచ్చుమర్రి, గండికోట ద్వారా నీటిని అందించామని అన్నారు. తమిళనాడు సీఎం కోరిక మేరకు వీలైనంత వరకు నీరు ఇస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తెలుగు వారి చరిత్రను అద్భుతంగా తెరకెక్కించారని, అమరావతి కేంద్రంగా అఖండ భారతాన్ని పాలించిన చరిత్ర శాతకర్ణిదని చంద్రబాబు అన్నారు.

More Telugu News