: ఒకటిన్నర లక్షల కోట్లతో 205 బోయింగ్ విమానాల ఆర్డర్: స్పైస్ జెట్

ఇండియాలోని ఎయిర్ లైన్స్ సంస్థలు ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ఇదే. దేశీయ విమానయాన రంగాన్ని మరో మెట్టెక్కించేలా దాదాపు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలతో 205 బోయింగ్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చినట్టు ప్రైవేటు రంగ స్పైస్ జెట్ శుక్రవారం నాడు వెల్లడించింది. సంస్థ చైర్మన్ అజయ్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ఈ ఆర్డర్ లో భాగంగా 155 బోయింగ్ 737-8 మ్యాక్స్, 50 డ్రీమ్ లైనర్, బీ-737ఎస్ లను దశలవారీగా అందుకోనున్నామని ఆయన తెలిపారు. గడచిన ఏడు త్రైమాసికాలుగా స్పైస్ జెట్ లాభాల్లో నడుస్తోందని, 20 నెలలుగా 90 శాతం లోడ్ ఫ్యాక్టర్ తో సాగుతున్నామని వివరించారు.

కాగా, బోయింగ్ కు పోటీగా ఉన్న సంస్థ ఎయిర్ బస్ కు భారత అతిపెద్ద బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగోతో పాటు, గో ఎయిర్ నుంచి ఇప్పటికే భారీ డీల్స్ వెళ్లిన నేపథ్యంలో ఈ డీల్ తాము ఇండియాలో మరింతగా విస్తరించేందుకు ఉపకరిస్తుందని బోయింగ్ భావిస్తోంది. ముడిచమురు ధరల పతనం కారణంగా, విమాన ఇంధన ధరలు, ఆపై ప్రయాణ టికెట్ ధరలు తగ్గడంతో సాలీనా ప్రయాణికుల వృద్ధి 20 శాతంగా ఉందన్న సంగతి తెలిసిందే.

More Telugu News