: 10 బిలియన్ డాలర్ల మైలురాయిని తాకిన ఇన్ఫోసిస్

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఓ క్యాలెండర్ ఇయర్ లో తొలిసారిగా 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 67,500 కోట్లు) ఆదాయం నమోదు చేసి, కీలకమైన మైలురాయిని తాకింది. సంస్థ మూడవ త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విశాల్ సిక్కా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్ఫోసిస్ భవిష్యత్తులో మరింతగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

కాగా, ఈ త్రైమాసికంలో సంస్థ నికర లాభం విశ్లేషకుల అంచనాలను మించి రూ. 3,708 కోట్లకు చేరుకుంది. సంస్థకు కొత్త డిప్యూటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా ఎస్ రవికుమార్ ను నియమించినట్టు సిక్కా వెల్లడించారు. ప్రస్తుతం రవికుమార్, గ్లోబల్ డెలివరీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉంచితే, ఈ సంవత్సరం ఆదాయ వృద్ధి అంచనా 8.4 నుంచి 8.8 శాతం వరకూ ఉండవచ్చని సిక్కా పేర్కొన్నారు. గతంలో వెల్లడించిన ఆదాయ అంచనాతో పోలిస్తే, ఇది తక్కువ. సంస్థ ఆదాయ అంచనాలు తగ్గడంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ పడిపోయింది. ఈ ఉదయం మార్కెట్ ప్రారంభంలోనే ఐటీ కంపెనీలు నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 10:50 గంటల సమయంలో ఇన్ఫోసిస్ 2.25 శాతం, టీసీఎస్ 3.60, విప్రో అర శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

More Telugu News