: తెలుగుదేశం నేతల ఆధిపత్య పోరుతో ఆగిన బాలకృష్ణ సినిమా

తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, విప్ ప్రభాకర్ మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ థియేటరులో బాలకృష్ణ సినిమా ప్రదర్శన ఆగినట్టు తెలుస్తోంది. కామవరపు కోట మండలం తడికలపూడిలో 'యూ-మ్యాక్స్' థియేటర్ నిర్మాణం జరుగగా, తొలి చిత్రంగా బుధవారం నాడు చిరంజీవి చిత్రం 'ఖైదీ నంబర్ 150'ని ప్రదర్శించారు. థియేటర్ ఓపెనింగ్ కు విప్ చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిధిగా వెళ్లారు. దీనికి తనకు ఆహ్వానం పలకకపోవడం పట్ల మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

ఆపై గురువారం నాడు బాలయ్య కొత్త చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' అదే థియేటరులో విడుదలైంది. చిత్రం ప్రదర్శన జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లిన రెవెన్యూ అధికారులు, సౌకర్యాలు సరిగ్గా లేవంటూ, థియేటరును సీజ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి సుజాత ఆదేశాలతోనే అధికారులు ఈ థియేటర్ ను మూయించారంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన ప్రభాకర్ తాను ప్రారంభించిన థియేటర్ ను సీజ్ చేయడంపై పీతల సుజాతతో స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇలా వివాదం ముదురుతుండడంతో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అయ్యన్నపాత్రుడు రంగంలోకి దిగి, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని హితబోధ చేసినట్టు సమాచారం. అయితే, సినిమా హాల్ ను సీజ్ చేయాలని తానెవరికీ సూచించలేదని సుజాత వివరణ ఇచ్చినట్టు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.

More Telugu News