: నోట్ల రద్దు ఎఫెక్ట్... ఆరేళ్ల కనిష్ఠానికి 'రియల్' డీల్స్!

గత సంవత్సరం నవంబర్ లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత, ఇండియాలో ఆస్తుల విక్రయం ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయిందని రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. బెంగళూరు సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో 44 శాతం వరకూ విక్రయాలు తగ్గాయని పేర్కొంది. 2010 నాలుగో త్రైమాసికం తరువాత, ఇంత తక్కువగా నిర్మాణ రంగంలో లావాదీవీలు తగ్గడం ఇదే తొలిసారని పేర్కొంది. బెంగళూరులో కేవలం 40,940 యూనిట్ల విక్రయాలు మాత్రమే సాగాయని, కొత్త ఆవిష్కరణలు ఏకంగా 61 శాతం పడిపోయాయని వెల్లడించింది.

ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, అహ్మదాబాద్ నగరాల్లోని నిర్మాణ రంగ వ్యాపారంపై విశ్లేషించి ఈ నివేదిక తయారు చేసినట్టు నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. నవంబర్ 8 తరువాత ఈ రంగంలో లావాదేవీలు దాదాపు ఆగిపోయాయని, 2008 నాటి ఆర్థికమాంద్యం తరువాత అత్యంత క్లిష్ట పరిస్థితులను రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఎదుర్కొంటున్నారని తెలిపింది. ఎనిమిది నగరాలనూ కలిపి పరిశీలిస్తే, 2015లో 2,67,960 యూనిట్ల విక్రయాలు జరుగగా, ఈ సంవత్సరం అది 9 శాతం తగ్గి 2,44,680 యూనిట్లకు తగ్గిందని వెల్లడించింది. వాస్తవానికి గత సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో రెసిడెన్షియల్ మార్కెట్ 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఆపై నిదానంగా సాగుతూ, నవంబర్ తరువాత పూర్తిగా నిలిచినట్లయిందని పేర్కొంది.

More Telugu News