: ఇండియా రెచ్చిపోతుంటే చూస్తూ కూర్చోబోము: హెచ్చరించిన చైనా

చైనా భద్రతకు విఘాతం కలిగించేలా వియత్నాం వంటి దేశాలతో సైనిక బంధాలను ఇండియా విస్తరించుకుంటూ వెళుతుంటే, తామేమీ చూస్తూ కూర్చోబోమని చైనా హెచ్చరించింది. ఉపరితలం నుంచి గగన లక్ష్యాలను ఛేదించే ఆకాశ్ క్షిపణులను వియత్నాంకు విక్రయించేందుకు ఇండియా డీల్ కుదుర్చుకోనుందని వచ్చిన వార్తలపై ప్రభుత్వ రంగ 'గ్లోబల్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

"బీజింగ్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తూ, వియత్నాంతో వ్యూహాత్మక ఒప్పందాలంటూ క్షిపణులను విక్రయిస్తుంటే, అది దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింతగా పెంచే అంశమే. పరిస్థితులు విషమిస్తుంటే చైనా ఏమీ చేతులు కట్టుకు కూర్చోదు" అని పేర్కొంది. చైనాకు అడ్డుకట్ట వేసేందుకే భారత ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోనుందని మీడియాలో వచ్చిన వార్తలను కూడా ప్రస్తావించింది. ఆసియాన్ దేశాల్లో భాగమైన వియత్నాంతో భారత్ మిలటరీ ఒప్పందాలకు తామేమీ అడ్డుకాబోమని, ఇదే సమయంలో తమ దేశానికి ముప్పు వాటిల్లితే మాత్రం చర్యలు తప్పవని పేర్కొంది. కాగా, భారత్, వియత్నాం మధ్య ఆకాశ్ క్షిపణుల డీల్ పై ఇరు దేశాలూ సంతకాలు చేయాల్సి వుంది.

More Telugu News