: ‘గూగుల్’ పుణ్యం.. ఆత్మహత్య చేసుకోవాలన్న యువతి మనసు మార్చుకుందిలా!

‘గూగుల్’ సెర్చ్ ఇంజన్ పుణ్యమా అని.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక యువతి బతికి బయటపడింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక యువతి, కొంతకాలంగా ఓ వ్యక్తితో  ప్రేమలో పడింది. అతనికి ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం కూడా లభించింది. అయితే, అతని కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా, ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో, మనస్తాపం చెందిన ఆ యువతి, యమునా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకుంది.

అయితే, ధైర్యం చాలక వెనుకడుగు వేసింది. ఆత్మహత్య చేసుకోవడానికి ఇతర మార్గాల కోసం అన్వేషించే క్రమంలో, ఆ యువతి ‘గూగుల్’ సెర్చ్ ఇంజన్ ని ఆశ్రయించింది. ఈ క్రమంలో, ఆమెకు ఒక టోల్ ఫ్రీ నంబర్ కనపడటంతో, ఆ నంబర్ కు ఫోన్ చేసింది. ఇక్కడే, కీలక మలుపు చోటుచేసుకుంది. ఆ టోల్ ఫ్రీ నంబర్ ఎవరిదనుకున్నారు.. స్థానిక డీఐజీది. ఆ యువతితో మాట్లాడిన డీఐజీ, కౌన్సెలింగ్ కు వచ్చేలా ఆ యువతిని ఒప్పించాడు.

అక్కడి మహిళా పోలీస్ స్టేషన్ లో రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా ఆ యువతిలో ఆత్మస్థయిర్యం నింపారు. దీంతో, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు ఆ యువతి గుడ్ బై చెప్పింది. తమ సెర్చ్ ఇంజన్ ద్వారా ఆ టోల్ ఫ్రీ నంబర్ ను అందించిన ‘గూగుల్’, ఆ యువతి ప్రాణాన్ని కాపాడి పుణ్యం కట్టుకున్నట్లేగా!

More Telugu News