: పోలీసులకు సవాల్ విసిరిన దొంగ దొరికినట్టే దొరికి.. మళ్లీ తప్పించుకున్నాడు!

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చెర్లగూడెం గ్రామానికి చెందిన బాసుపల్లి ప్రవీణ్ (22) పరిగి రోడ్డులోని వాషింగ్ సెంటర్ లో పనిచేస్తుంటాడు. రాత్రి వేళల్లో మాత్రం చిల్లర దొంగతనాలకు పాల్పడుతుంటాడు. సుమారు ఆరు నెలలుగా పరిగి రోడ్డులోని కిరాణా దుకాణాలతో పాటు ఎలక్ట్రికల్, సిమెంటు దుకాణాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డాడు. అయితే, అక్కడి ఒక సిమెంటు దుకాణంలో చోరీకి పాల్పడ్డ  ప్రవీణ్, రూ.4 వేలతో పాటు బ్యాంకు చెక్కులనూ దొంగిలించాడు. అంతేకాకుండా, ఆ దుకాణంలో ఉన్న డైరీలో ‘నా పేరు దొంగ రవి.. నన్నెవరూ పట్టుకోలేరు’ అని రాశాడు.

దొంగిలించిన చెక్కులను చాకచక్యంగా క్యాష్ చేసుకున్నాడు. అయితే, ఆయా చెక్కులకు సంబంధించిన ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బాసుపల్లి ప్రవీణ్ అలియాస్ దొంగ రవిని నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పోలీసులకు దొరికిన 'దొంగ రవి' నిన్న తప్పించుకున్నాడు. తనకు మూత్రం వస్తోందని చెప్పడంతో కానిస్టేబుల్ బయటకు తీసుకువెళ్లాడు. ఇదే అదునుగా భావించిన రవి సదరు కానిస్టేబుల్ ను పక్కకు తోసేసి, బేడీలతో సహా పారిపోయాడు. ఈ నేపథ్యంలో దొంగ రవి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

More Telugu News