: విద్యార్థినులను అడగకూడని ప్రశ్నలు అడిగిన బీహార్ ఎమ్మెల్యే!

బీహార్ లోని వైశాలి జిల్లాలో దళిత విద్యార్థినుల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో ఉంటున్నఒక విద్యార్థిని రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనే అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లాలన్ పాసవాన్ నిన్న అక్కడికి వెళ్లారు. ఈ సంఘటనపై విద్యార్థినులను ఆరా తీసే క్రమంలో అడగకూడని ప్రశ్నలు అడగటం వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు ఒక విద్యార్థిని ఇబ్బందిపడుతూ సమాధానాలు చెబుతున్న దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో రావటంతో విమర్శలు తలెత్తాయి.

సదరు విద్యార్థినితో ఎమ్మెల్యే మాట్లాడిన తీరు గురించి చెప్పాలంటే... ‘ఆ సంఘటన గురించి వివరంగా చెప్పాలి. నువ్వు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ, ఇటువంటి సంఘటన రేపు నీకే జరిగితే? అత్యాచారం చేసే వ్యక్తి నీ గదికే వస్తే...’ అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఆ విద్యార్థిని అవాక్కయింది. అయితే, దళిత విద్యార్థినులకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడానని, ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయమై ప్రశ్నిస్తే, మీడియా రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. తాను అడిగిన విధానం తప్పయితే అయి ఉండవచ్చు కానీ, తన ఉద్దేశం మాత్రం మంచిదేనని ఆ ఎమ్మెల్యే సమర్థించుకోవడం గమనార్హం.

More Telugu News