: టీడీపీ నేత సోమిరెడ్డి విదేశీ ఆస్తుల వివాదం: గోవర్ధన్ రెడ్డి చూపినవి నకిలీ డాక్యుమెంట్లు అని తేల్చిన పోలీసులు!

టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఎన్నో ఆరోప‌ణ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. అందుకు సంబంధించిన ఆధారాలుగా కాకాని ప‌లు డాక్యుమెంట్ల‌ను కూడా మీడియా ముందు ఉంచారు. అయితే, దీనిపై ఆగ్రహం వ్య‌క్తం చేసిన‌ సోమిరెడ్డి ఇటీవ‌లే విజ‌య‌వాడలో డీజీపీకి ఫిర్యాదు చేయ‌డంతో ఆ డాక్యుమెంట్ల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు నిజానిజాల‌ను వెలికితీశారు. అవ‌న్నీ త‌ప్పుడు డాక్యుమెంట్లేన‌ని, అవి సృష్టించిన‌వేన‌ని ఈ రోజు నెల్లూరులో ఆ జిల్లా ఎస్పీ విశాల్ పేర్కొన్నారు. న‌కిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తోన్న ఓ ముఠా సభ్యుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.

విదేశాల్లోని రెవెన్యూ అథారిటీ వెబ్‌సైట్ లోకి వెళ్లి అక్క‌డి వివ‌రాలు, ముద్ర‌లను ప‌రిశీలించి ఈ ముఠా న‌కిలీ డాక్యుమెంట్ల‌ను క్రియేట్ చేసిందని ఎస్పీ తేల్చిచెప్పారు. వివాదాల్లో ఉన్న నేత‌ల‌ను ప‌రిశీలించి వారిపై న‌కిలీ డాక్యుమెంట్ల‌ను సృష్టించి ఈ ముఠా అమ్ముకుంటోంద‌ని చెప్పారు. ఇలాంటి క‌ల్చ‌ర్ రావ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని ఇటువంటి ఘ‌ట‌న‌లు మ‌ళ్లీ చోటుచేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఈ కేసు ఎంతో సెన్సిటివ్ కేస‌ని, ప్ర‌జాప్ర‌తినిధులు ఈ కేసులో ఉన్నారు కాబ‌ట్టి అన్ని అంశాల‌ను ప‌రిశీలించి ద‌ర్యాప్తు జ‌రుపుతున్న‌ట్లు తెలిపారు. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మరి కొందరు నిందితులను ప‌ట్టుకుంటామ‌ని, ఇటువంటి న‌కిలీ డాక్యుమెంట్ల కేసులు పెర‌గ‌కుండా పోలీసులు మ‌రింత స‌మ‌ర్థంగా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. నిందితుల‌ని రిమాండ్ కు త‌ర‌లిస్తామ‌ని చెప్పారు.

More Telugu News