suicide: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య.. అమ్మానాన్న, చెల్లి బాగుండాలని సూసైడ్ నోట్‌

జీవితంలో తాను అనుకున్నది సాధించలేకపోతున్నానంటూ ఓ ఐటీ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న హైద‌రాబాద్‌, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన 30 ఏళ్ల‌ యలమంచిలి సుధాకర్‌రావు నగరంలోని నానక్‌రాంగూడలోని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ కంపెనీలో రీసెర్చ్‌ అనలిస్టుగా ఉద్యోగం చేస్తున్నాడు. త‌న‌ కంపెనీకి సమీపంలోని గోపన్‌పల్లిలోని జర్నలిస్టు కాలనీలో ఓ అపార్టుమెంట్‌ పెంట్‌హౌస్‌లో ఉంటున్నాడు. అత‌డి కుటుంబం న‌గ‌రంలోని వనస్థలిపురంలో ఉంటోంది. నాలుగురోజుల క్రితం త‌న కంపెనీ నుంచి త‌న రూమ్‌కి వ‌చ్చిన అత‌డు మ‌ళ్లీ ఆఫీసుకి వెళ్ల‌లేదు. మ‌రోవైపు సుధాక‌ర్‌రావు సోద‌రి అత‌డికి రెండు రోజులుగా ఫోన్ చేస్తోన్నప్పటికీ స్పంద‌న లేదు. దీంతో ఆమె సుధాకర్‌రావు స్నేహితుడు సతీష్‌రెడ్డికి ఈ విష‌యాన్ని తెలిపింది.

ఈ రోజు సుధాకర్‌రావు ఉంటున్న అపార్టుమెంట్‌కు స‌తీష్‌రెడ్డి వెళ్లాడు. అత‌డి ఇంటి తలుపులు లోపల నుంచి గడియపెట్టి ఉండడంతో పాటు లోపల నుంచి దుర్వాసన రావ‌డాన్ని గ‌మ‌నించిన స‌తీష్‌రెడ్డి పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. వెంట‌నే పోలీసులు అక్క‌డ‌కు చేరుకొని తలుపులు పగలగొట్టి  చూశారు. రూమ్‌లో సుధాకర్‌రావు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెంది క‌నిపించాడు. త‌న‌ అమ్మానాన్న, సోద‌రి బాగుండాలని, తాను అనుకున్నది సాధించలేకపోతున్నాన‌ని, త‌న‌కు వేరే అవ‌కాశం లేద‌ని సుధాక‌ర్‌రావు రాసిన ఆత్మ‌హ‌త్య లేఖ‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత‌డి మృతదేహాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించిన పోలీసులు కేసులో ద‌ర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News