: సైకిల్‌పై లక్షా 38 వేల కిలోమీటర్లు ప్రయాణించిన యువ‌కుడు.. ఇంకా కొన‌సాగిస్తున్నాడు!

సైకిల్ ఎక్కాడు.. షాప్‌కు వెళ్లి రావ‌డానికి కాదు.. మొత్తం ప్ర‌పంచాన్నే చుట్టిరావ‌డానికి. సైకిల్‌పైనే లక్ష కిలోమీటర్లకు పైగా ప్రయాణించాడు. ఇంత‌టి సాహ‌సాన్ని చేస్తోన్న వ్య‌క్తి పేరు సోమెన్‌ డెబ్‌నాథ్‌. అత‌డు పశ్చిమ బెంగాల్ లోని సుందర్‌బన్‌ అటవీ ప్రాంతంలోని ఓ గ్రామవాసి. 14 ఏళ్ల వయసులో తాను చదివిన ఓ ఎయిడ్స్ బాధితుడి క‌థే అత‌డిని ఈ సైకిల్‌పై తిరిగేలా చేసింది.
ఎయిడ్స్‌ కారణంగా ఓ వ్య‌క్తిని గ్రామం నుంచి వెలివేశార‌ని, అనంత‌రం ఆ వ్య‌క్తి ఒంటరిగా జీవిస్తూ మృతి చెందాడ‌ని  సోమెన్‌ డెబ్‌నాథ్ చ‌దివాడు. వ్యాధితో బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి పట్ల ప్ర‌జ‌లు చూపిన తీరుపై ఆవేద‌న చెందాడు.ఎయిడ్స్‌పై అవగాహన లేకపోవడం వ‌ల్లే ఇలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అర్థం చేసుకున్నాడు. ఇక‌ ఎయిడ్స్‌పై ప్ర‌చారం చేయాలని ప్ర‌జ‌ల్లో ఉన్న భ‌యాల‌ను, అనుమానాల‌ను పోగొట్టాల‌ని అనుకున్నాడు.

త‌న‌ డిగ్రీ పూర్తవగానే ఎయిడ్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాల‌ని అనుకున్నాడు. ఎయిడ్స్ వ్యాధి గురించి మొత్తం తెలుసుకొని ఓ ప్రజెంటేషన్‌ రూపొందించుకున్నాడు. అయితే, అన్ని ప్రాంతాల‌ను తిరిగి రావ‌డానికి అత‌డి వ‌ద్ద డ‌బ్బు మాత్రం లేదు. తన సైకిల్‌పైనే తిరిగితే అంతగా ఖర్చు కాద‌ని సైకిల్‌ యాత్ర మొదలు పెట్టాడు. మూడు నెలలు సైకిల్‌పైనే ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుతూ అక్క‌డి ప్ర‌జ‌ల‌కి ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాడు. అయితే అంత‌టితో సంతృప్తి చెంద‌లేదు. అనంత‌రం భారతదేశం మొత్తం తిరిగి ఎయిడ్స్‌పై అవగాహన కలిగించాలని నిర్ణ‌యించుకున్నాడు. మ‌ళ్లీ సైకిల్ ఎక్కి మూడేళ్ల పాటు దేశం మొత్తం తిరిగి ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాడు. త‌న అవ‌గాహన‌ కార్య‌క్ర‌మాన్ని అంత‌టితో వ‌ద‌లిలేయ‌క‌ ప్రపంచం మొత్తం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

ప్రపంచంలోని 191 దేశాల్లో 2020లోపు తిరిగేసి ఎయిడ్స్‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని నిర్ణయించుకున్నాడు. అందుకోసం మ‌రోసారి 2004లో సైకిల్ ఎక్కి ప్రపంచయాత్రను మొద‌లుపెట్టాడు. మొదట్లో ఈ యాత్ర చేస్తానంటే అతని తండ్రి ఒప్పుకోలేదు. అయితే క‌ష్ట‌ప‌డి త‌న‌ తల్లిని ఒప్పించి సైకిల్‌పై ప్రపంచయాత్రకు వెళ్లాడు. 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 12 ఏళ్ల‌లో సైకిల్‌పై 126 దేశాల్లో లక్షా 38వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. ప‌నిలో ప‌నిగా ఇప్పుడు భారతీయ సంస్కృతిని కూడా ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. ప్రస్తుతం అత‌డు ఇప్పుడు అర్జెంటీనాలో ఉన్నాడు. త‌న ప్ర‌యాణంలో ఎన్నో క‌ష్టన‌ష్టాల‌ను ఎదుర్కున్నాడు. అయిన‌ప్ప‌టికీ త‌న కార్య‌క్ర‌మాన్ని మాత్రం ఆప‌డం లేదు. గ‌తంలో ఓసారి ఇరాక్‌లో బాంబు పేలుళ్ల నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డాడు. అనంత‌రం ఓసారి అప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల బారి నుంచి త‌ప్పించుకున్నాడు. మొత్తం 7,500 విద్యాసంస్థలతో పాటు 139 రెడ్‌ లైట్‌ ప్రాంతాల్లో తిరిగాడు.

More Telugu News