: ఇలా పట్టుబడటం తొలిసారి... ప్రెస్ నుంచి డైరెక్టుగా ఇంటికే కొత్త నోట్లు!

కొత్త నోట్ల రద్దు తరువాత, గంటల కొద్దీ బ్యాంకుల ముందు నిలుచున్నా, డబ్బులు చేతికి రావడం లేదని ప్రజలు వాపోతున్న వేళ, ఏకంగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే డబ్బులు ఇంటికి తెప్పించుకున్నాడో ఘనుడు. ఆర్బీఐ సీల్ కూడా తీయని నోట్ల కట్టలు కొందరి ఇళ్లకు చేరాయని అనుమానిస్తున్న ఐటీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు కొత్త విచారణను ప్రారంభించారు. 'హిందుస్తాన్ టైమ్స్'లో వచ్చిన ఓ కథనం ప్రకారం, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లోని రెండు ప్రభుత్వ కరెన్సీ ముద్రణా కార్యాలయాల సీల్ వేసి ఉన్న రూ.20 లక్షల విలువైన కొత్త రూ. 2000 నోట్లు ఢిల్లీలో పట్టుబడ్డాయి. అవి కూడా కృష్ణ కుమార్ అనే పేరున్న ఓ కొరియర్ బాయ్ దగ్గర.

'గ్రేటర్ కైలాష్-1 ఎం బ్లాక్' మార్కెట్లో అతను వేచిచూస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ముద్రణ సంస్థల సీల్ తో నగదు పట్టుబడటం ఇదే తొలిసారని,  ప్రింటింగ్ ప్రెస్ సిబ్బంది, రిజర్వ్ బ్యాంక్ చెస్ట్ లలో పనిచేసే ఉద్యోగులు రాజీపడి ఈ నేరానికి పాల్పడి వుండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నగదు సాల్బోని, నాసిక్ ప్రెస్ లలో ముద్రించినవని, బ్యాంకులకు చేరకుండానే డెలివరీకి వచ్చాయని తేల్చిన అధికారులు, వాటిని ఎవరికి ఇచ్చేందుకు కొరియర్ చేశారన్న విషయాన్ని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News