: అలాంటి సందర్భాల్లో రాజకీయాలు మనకు అవసరమా? అనిపించింది!: చిరంజీవి

పదేళ్లు రాజకీయాల్లో ఉండగా ఎన్నో ప్రశంసలు, విమర్శలు చూశానని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150 సినిమా షూటింగ్ స్పాట్ లోకి వెళ్లిన తరువాత, లైట్స్, సౌండ్, యాక్షన్ అన్న మాటలు విన్న తరువాత... 'వాహ్...ఇది కదా మన సామ్రాజ్యం!' అనిపించిందని చిరంజీవి తెలిపారు. 'దీనినా నేను ఇన్నాళ్లు మిస్సయింది?' అనుకున్నానని అన్నారు. అప్పుడు తొలిసారి... ఈ రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా? అనిపించిందని అన్నారు. అయితే ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసే భాగ్యం అతి కొద్ది మందికే లభిస్తుందని, అలా నిజాయతీగా సేవ చేసినప్పుడు లభించే ఆనందం మాటల్లో వర్ణించలేమని ఆయన తెలిపారు.

విభజన సమయంలో అప్పటి నేతలంతా కలిసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి... రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని కోరినప్పుడు, విభజన ఆపలేమని తెలిసినప్పుడు కనీసం హైదరాబాదును యూటీని చేయండంటూ తీవ్రంగా ప్రయత్నిస్తే... వీడేం చేశాడని కొంత మంది అడిగారని, మరి కొందరు తన ఇంటి బయట చీర, గాజులు పెట్టి అవమానించారని, మరి కొందరు కాకినాడలో అసభ్యకరమైన ఫోటోొలు పెట్టి విమర్శించారని గుర్తు చేసుకున్నారు. ఇంత నిజాయతీగా ప్రజల కోసం పోరాడితే మనకు లభించే సన్మానం ఇదా? ఇలాంటప్పుడు రాజకీయాలు అవసరమా? అనిపించిందని ఆయన చెప్పారు. అలాంటప్పుడు చాలా బాధవేసిందని, గుండెను మెలిపెట్టినట్టు అనిపించిందని ఆయన తెలిపారు. 

More Telugu News