: ఈ మధ్యనే కాఫీ తాగుతున్నాను.. చేపలు మంచిదని తింటున్నాను: సీఎం చంద్రబాబు

గతంలో తాను కాఫీ తాగేవాడిని కాదని, ఈ మధ్యనే కాఫీ తాగుతున్నానని, ఆరోగ్యానికి మంచివని చెప్పడంతో చేపలు కూడా తింటున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా చెన్నూరులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు తన ఆహార అలవాట్లను ప్రజలకు వివరించారు. తాను పూర్తిగా సాధారణ ఆహారం తీసుకుంటానని, అందువల్లే, తాను ఆరోగ్యంగా వుండగలుగుతున్నానని చెప్పారు.  ఈ సందర్భంగా బ్రేక్ ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ తాను తీసుకునే డైట్ ప్లాన్ గురించి చెప్పారు.

‘సజ్జ, రాగి, జొన్న.. ఇలా రోజుకొక వెరైటీని మంచినీళ్లతో కలిపి ఉడకబెట్టిన దానిని తెల్లారగానే తీసుకుంటాను. రెండు కోడి గ్రుడ్లు.. అవీ కూడా పచ్చసొన లేకుండా తీసుకుంటాను. మధ్యాహ్నం కూడా సజ్జ, రాగి, జొన్నల్లో ఏమీ కలపకుండా, రెండు కూరగాయలు, కొద్దిగా పెరుగు, ఏదో ఒక పండు తీసుకుంటాను. చేపలు మంచిదని చెబుతున్నారు కాబట్టి, ఈ మధ్య చేపలు కూడా తింటున్నాను. సాయంత్రం పూట డ్రై ప్రూట్స్ తీసుకుంటాను. ఒక టీ తాగుతాను. రాత్రి పూట ఒక సూప్ గానీ, ఒక ఫ్రూట్ గానీ తీసుకుంటాను.

ఇక నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు పాలు తీసుకుంటాను. నేను తినే తిండి మీకు దొరకదా? అని మిమ్మల్ని అడుగుతున్నాను. నేను తినే ఆహారం అందరికీ దొరుకుతుంది. కానీ, మీరు తినరు. మీరు ఆశపడతారు.. మీకు మొదటి విరోధి మీ నాలుక. కొంతమందికి సాయంత్రమైతే తాగాలని వుంటుంది. ఎక్కడ షాపు ఉంటే అక్కడికి అది మిమ్మల్ని లాక్కెళుతుంది. అక్కడ నుంచి అన్ని సమస్యలు వస్తుంటాయి. నేను చేపలు తినడం ప్రారంభించినప్పటి నుంచి చేపల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. చేపలు తింటే తెలివి కూడా బాగా వస్తుంది. పిల్లలకు తప్పనిసరిగా చేపలు తినిపిస్తే, బ్రహ్మాండమైన నాలెడ్జి వస్తుంది’ అని చంద్రబాబు అన్నారు.

More Telugu News