: ముఖ్యమంత్రి చంద్రబాబుకి ‘రుద్ర‌మ‌దేవి’ దర్శకుడు గుణ‌శేఖ‌ర్ ఆవేదనాభరిత లేఖ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకి ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఈ రోజు ఓ లేఖ రాశారు. సినీనటుడు బాల‌కృష్ణ న‌టించిన 100వ చిత్రం ‘గౌత‌మిపుత్ర‌ శాత‌క‌ర్ణి’కి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం వినోద ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే... ఆ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ గుణ‌శేఖ‌ర్ రాసిన లేఖ‌.. య‌థాత‌థంగా....

గౌర‌వ‌నీయులైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారికి,
నూత‌న సంవ‌త్సర, సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ గౌర‌వ‌వంద‌నాలు..
ముందుగా చారిత్రాత్మ‌క చ‌ల‌న‌చిత్రంగా రూపొందించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణికి వినోద‌పు ప‌న్నురాయితీ ప్ర‌క‌టించి, క‌ళ‌లప‌ట్ల, సంస్కృతి ప‌ట్ల మీరు చూపే ఆద‌రాభిమానాల‌కు సాటి తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తిగా ధ‌న్యవాదాలు తెలియ‌జేస్తున్నాను.

2015 అక్టోబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా నాలుగు(తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం) భాష‌ల్లో నా ద‌ర్శ‌క‌త్వం నిర్మాణ బాధ్య‌త‌ల‌తో గుణాటీమ్ వ‌ర్క్స్ ప‌తాకంపై విడుద‌లయిన రుద్ర‌మ‌దేవి చిత్రం కూడా దాదాపు మూడు ద‌శాబ్దాల త‌రువాత తెలుగులో నిర్మించ‌బ‌డ్డ చారిత్రాత్మ‌క చిత్రంగా గ‌తంలోనే వినోద‌పు ప‌న్ను రాయితీ కోరుతూ రాత పూర్వ‌కంగా ద‌ర‌ఖాస్తు చేసుకుని మీ ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చింది. ముందుగా సానుకూలంగా స్పందించిన ప్ర‌భుత్వాధికారులు కొంత పురోగ‌తిని చూపి (ద‌ర‌ఖాస్తుదారుని విన్న‌పం మేర‌కు క‌మిటీ ఏర్పాటు చేయాల‌ని ఉత్త‌ర్వులు జారీచేసి) అర్థాంత‌రంగా ఫైలు మూసేశారు. ఈ త‌రువాత మిమ్ముల‌ను గానీ, సంబంధిత అధికారుల‌ని గానీ శ‌త‌థా ప్ర‌య‌త్నించినా క‌లుసుకోలేక‌పోయాను.

ఈ పురుషాధిక్య స‌మాజంలో 13వ ద‌శాబ్ధంలోనే స్త్రీ సాధికారత‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా చాటిచెప్పిన కాక‌తీయ మ‌హాసామ్రాజ్ఞి రాణీ రుద్ర‌మ‌దేవీ చ‌రిత్ర‌ను ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న ఈ పురుషాధిక్య స‌మాజంలో (భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు కూడా దీనికి మిన‌హాయింపు కాద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేద‌ని భావిస్తున్నాను) ఆద‌ర్శ‌వంత‌మైన స్త్రీమూర్తి జీవిత‌గాధ‌గా ఎన్నో వ్య‌య‌ప్ర‌యాస‌ల‌ను ఓర్చి, భార‌తదేశంలోనే మొట్ట‌మొద‌టి స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రంగా అత్యున్న‌త సాంకేతిక ప్ర‌మాణాల‌తో ఈ చిత్రాన్ని నిర్మించి, ఓ స‌గ‌టు క‌ళాకారుడిగా ఆమె జీవితాన్ని వెండితెర‌పై ఆవిష్క‌రించి ఆమె చ‌రిత్ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రాచుర్యం క‌ల్పించడం క‌ళామ‌త‌ల్లికి నా వంతు సేవ‌గా భావించాను.

ఈ మ‌హాత్కార్యంలో ఎంద‌రో చిత్ర‌ప్ర‌ముఖులు నాకు అండ‌గా నిలిచారు. చిత్రం విడుద‌ల స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో పాటు, నేను గౌర‌వ‌నీయులు తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు గారికి కూడా ద‌రఖాస్తు చేసుకోగా ఆయ‌న త‌క్ష‌ణ‌మే స్పందించి తెలంగాణ రాష్ట్రానికి గానూ వినోద‌పుప‌న్ను రాయితీని క‌ల్పించారు. నేనాశించిన‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా వినోద‌పు ప‌న్ను రాయితీ ప్ర‌క‌టించి ఉంటే నిర్మాత‌గా నాకు కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగి ఉండేది. రాణీ రుద్ర‌మ‌దేవీ కేవ‌లం తెలంగాణ‌కే ప‌రిమిత‌మైన నాయ‌కురాలు కాదని..దాదాపు ద‌క్షిణాప‌థమంత‌టినీ పాలించిన మ‌హారాణి అని.. ఆమె ప‌ట్టాభిషేకం సంద‌ర్భంగా ఏపీలోని అమ‌రావ‌తి మంగ‌ళ‌గిరి వ‌ద్ద ఉన్న మార్కాపురం శాసనం కూడా ఉంద‌ని ఇటీవ‌ల మీరు కూడా ఒకానొక స‌భ‌లో ఉద‌హ‌రించారు.

ఈ నేప‌థ్యంలో నా ద‌ర‌ఖాస్తుని పునఃప‌రిశీలించి ఇప్ప‌టికే రుద్ర‌మ‌దేవి చిత్రానికి ఏపీలో వ‌సూలు చేసిన వినోద‌పు ప‌న్ను మొత్తానికి స‌మాన‌మైన ప్రోత్సాహ‌క న‌గదుని అంద‌జేయండి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిష్ప‌క్ష‌పాతంగా, పార‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తోంద‌ని ఇదివ‌ర‌కే ఎన్నో సంద‌ర్భాల్లో రుజువు చేసిన‌ట్లు మ‌రోసారి మీ సాంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నార‌ని ఆశిస్తూ...

 భ‌వ‌దీయుడు..
గుణ‌శేఖ‌ర్    

More Telugu News