: 'టైగర్' చేతుల్లోకి వెళ్లిపోయిన ఫ్లిప్ కార్ట్... కొత్త సీఈఓగా కల్యాణ్ కృష్ణమూర్తి

దాదాపు పదేళ్ల క్రితం ఓ స్టార్టప్ సంస్థగా ఫ్లిప్ కార్ట్ ను స్థాపించి, వేల కోట్ల రూపాయల టర్నోవర్ కు దాన్ని చేర్చిన సోదర ద్వయం సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్, సంస్థ నిర్వహణా నియంత్రణను అమెరికన్ ఇన్వెస్టర్ సంస్థ టైగర్ గ్లోబల్ కు అప్పగించగా, కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా కల్యాణ్ కృష్ణమూర్తిని నియమిస్తున్నట్టు టైగర్ గ్లోబల్ పేర్కొంది. బిన్నీ బన్సాల్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారని తెలిపింది. ఫ్లిప్ కార్ట్ సంస్థలో అత్యధిక పెట్టుబడులు టైగర్ గ్లోబల్ పేరిట ఉన్న సంగతి తెలిసిందే.

సంస్థకు ప్రధాన పోటీదారు అయిన అమేజాన్ ను ఎదుర్కోవాలంటే, మరిన్ని పెట్టుబడులు, విస్తరణ, కొత్త నాయకత్వం అవసరమని భావించిన టైగర్ గ్లోబల్ ఒత్తిడి మేరకే ఈ మార్పులు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, అమేజాన్ లో టైగర్ గ్లోబల్ కు సైతం పెట్టుబడులు ఉండటంతో, భవిష్యత్తులో ఈ రెండూ విలీనం కావచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం, చైనా కేంద్రంగా నడుస్తున్న అలీబాబాను సమర్థవంతంగా ఎదుర్కోగల పశ్చిమ దేశాల సంస్థగా అమేజాన్ ను నిలపాలన్నదే టైగర్ గ్లోబల్ అభిమతమని సమాచారం.

More Telugu News